ఒక్కోసారి ఎదురయ్యే అనుకోని అవమానాలే మనలో పంతం పెంచి మనల్ని ఉన్నతశిఖరాలను చేరుస్తాయి. అలా ఎదిగిన వారిలో దాసరి కూడా ఒకరు. ఆయన తన ఎనిమిదో ఏట నుంచే పలు నాటకాలు వేసేవారు. 12ఏళ్ల వయసులోనే ఓ నాటకాన్ని రాసి, దర్శకత్వం వహించారు. ఆనాడే ఒక పెన్నును బహుమతిగా పొందాడు. ఇక ఆయనలోని నటుడిని, దర్శకుడిని, రచయితను ఓ నిర్మాత చూశాడు. దాసరి ఉద్యోగంలో బిజీగా ఉన్న రోజుల్లో ఆ నిర్మాత కృష్ణయ్య దాసరిని తన చిత్రంలో ఓ వేషం ఉందని వేయమని బలవంతం చేశాడు.
కానీ దాసరి నాకు సినిమా వేషాలు వద్దని మొహాన చేప్పేశాడు. కానీ ఆ నిర్మాత ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి బలవంతం చేయడంతో మద్రాస్ వెళ్లాడు. ఆయనకు రంగస్థల నటునిగా చిన్న వయసులోనే గోల్డ్‌మెడల్, రాష్ట్రస్థాయి ఉత్తమనటుడు, రంగ స్థల దర్శకునిగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. సరే నిర్మాత బలవంతం చేస్తున్నాడు కదా! అని మద్రాస్ వెళ్లిన అతనికి తొలిరోజే ఘోర అవమానం జరిగింది. ప్రతి ఒక్కడు ఏదో ఒక నాటకం వేయడం, ఓ కప్పు రాగానే ఇక సినిమా నటునిగా వెలిగిపోదామని మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌లో దిగి పోలో మని వచ్చేయడం...అసలు నీవు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అంటూ కృష్ణ అనే మేకప్‌మేన్ దాసరిని తీవ్రంగా అవమానించాడు.
ఇది నాకై నేను వెత్తుకుంటూ వచ్చిన అవకాశం కాదు. నన్ను పిలిచి బలవంతపెడితే వచ్చాను.. కానీ ఇతనేంటి ఇలా అవమానిస్తున్నాడు? అంటూ దాసరి ఎంతగానో ఆవేదన చెందారు. అసలే ఆ షాక్‌లో ఉన్న దాసరికి మరో రోజు మరో పెద్ద షాక్ తగిలింది. దాసరిని నిర్మాత కృష్ణయ్య మెయిన్ హాస్యనటుడి క్యారెక్టర్‌కి పిలిచాడు. కానీ అప్పటికే మెయిన్ హాస్యనటుడి పాత్రను నాటి ప్రముఖ హాస్యనటుడైన బాలకృష్ణని తీసుకొని, ఆయన మీద షూట్ చేయడం కూడా జరిగిపోయింది. నిర్మాత వద్దకు వెళ్లితే దాసరికి అది నిర్మాతకు కూడా తెలియకుండా జరిగిందని తెలిసింది. దాంతో దాసరికి ఎంతో అవమానం వేసింది. అదే ఆయన పురోగతికి మెట్లయింది.