తాననుకున్న పనిని నిబద్దతో చేయడం, ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా ముందుకు దూసుకెళ్లడం, ఏ స్టార్‌కో కోపం వస్తుందని భజన చేయడం ఆయనకు చేతకాని పని, ముక్కుసూటిగా ఉండేవారు. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతటి పెద్ద మనుషుల ముందైనా, ఎంతటి పెద్ద వేదికపైనేనా తడుము కోకుండా, సూటిగా, సుత్తిలేకుండా చెప్పి సంచలనం సృష్టించేవాడు. తాత-మనవడుతో ప్రయాణమైన ఆయన తన తొలి చిత్రం ద్వారానే కొడుకులు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే సందేశం ఇచ్చాడు.
ఇక స్వర్గం-నరకం, మేఘసందేశంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. కేంద్రంతో ఆయన కాస్త రాజీ పడి ఉంటే ఇంకా మంత్రిగా కొనసాగే వాడే. కానీ నాటి మంత్రులు, నాయకులు తమ ఒత్తిడితో అధికారుల చేత చేయకూడని పనులు చేయించి, తద్వారా వచ్చే ఆదాయంలో భాగాన్ని సూట్ కేసుల రూపంలో అధిష్టానానికి ఇచ్చి మెప్పు పొందేవారు. కానీ దానికి దాసరి వ్యతిరేకి. ఏనాడు ఆయన ఆ పని చేయలేదని ఆయనను ఎరిగిన పలువురు చెబుతారు.
ఇక ఒకానొక దశలో ఎన్టీఆర్‌తో విభేధించిన తర్వాత తానే స్వయంగా 'తెలుగు తల్లి' అనే పార్టీని స్థాపించి, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేసి, కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఆయన నటించి, దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'ఎర్రబస్సు' ఆయన తీసిన మొదటి చిత్రం 'తాతామనవడు' లాగానే ఇది కూడా తాతమనవళ్ల కథే కావడం యాదృచ్చికం. ఇక ఆయన నాటి కళాఖండం 'మాయాబజార్'ను సాంఘీకరించి ఏయన్నార్, సుమన్‌లతో తీశాడు.