సినీ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అది ముందు గురువు గారైన దాసరి నారాయణ రావు వద్దకు వెళ్లేది. పైరసీ సమస్యల నుంచి ఫ్రీమేక్, కథాచౌర్యం, నిర్మాతల వేదింపులు, నిర్మాతల కష్టాలు, నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఆర్టిస్టులు, ఆర్టిస్టులను ఇబ్బందులు పెట్టే నిర్మాతలు, దర్శకులు... ఇలా సమస్య ఏదైనా ఆయన తన చాతుర్యంతో ఆ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు. ఆయన చెప్పిందే తెలుగు ఇండస్ట్రీలో వేదం.
ఆయన వద్దకు వెళ్లిన సమస్యలు పరిష్కారం కాకపోవడం కానీ, ఆయన తీర్పును ఎవరైనా వ్యతిరేకించడం గానీ జరిగేది కాదు. ఇక ఆయన ఇండస్ట్రీలోని కార్మికులకు 24 గంటలు అందుబాటులో ఉండేవారు. వారి సమస్యలను తన సమస్యలుగా భావించేవారు. వారికి ఏ అవసరం వచ్చినా నేనున్నాననే వాడు. ఇక తన సొంత ఊరు పాలకొల్లును కూడా ఆయన మర్చిపోలేదు. అక్కడ ఎన్నో ప్రజోపకరమైన పనులు చేసేవాడు. తన ప్రతి పుట్టినరోజునా పాలకొల్లుకు ఏదో ఒకటి ప్రసాదించేవారు. ఇక ఆయన శ్రీమతి పద్మ కూడా ఆదర్శభావాలున్న సహధర్మచారిణి. దాసరి ఎక్కిన ప్రతి మెట్టులోనూ ఆమె ప్రోత్సాహం, ఆమె సలహాల శాతం ఎంతగానో ఉండేది.
మోహన్ బాబుతో పాటు దాసరి శిష్యులందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకొనేది. ఇక ఆమెకు బుల్లితెర అన్నా, సీరియళ్లన్నా చాలా ఇష్టం. ఆమె అభీష్టం మేరకే దాసరి కూడా బుల్లితెరలోకి ప్రవేశించాడు. రామానంద సాగర్ వంటి వారు రామయణం వంటి సీరియల్స్‌తో సంచలనం సృష్టిస్తున్న సమయంలో 'బ్రహ్మర్షీ విశ్వామిత్ర' సీరియల్‌ను తీసి దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు చూరగొన్నాడు. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న 'అభిషేకం' సీరియల్ అతి పెద్ద సంచలనం. ఈ చిత్రం డైలీ సీరియల్‌గా అత్యధిక ఎపిసోడ్లతో రికార్డు సృష్టిస్తోంది. ఇక 'గోకులంలో సీత' వంటి పలు సీరియళ్లకు స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.
ఇక ఆయన తన జీవిత చరిత్రగా 'పేదవాడి ప్రయాణం' రాయాలనుకున్నాడు. కానీ అది మొదలుపెట్టకుండానే దివికేగాడు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ఆయన జీవితంపై 'విశ్వవిజేత విజయగాధ' పుస్తకాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక తన పేరుతో చానెల్‌డి అనే శాటిలైట్ చానెల్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. అందుకోసం అనేక చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా కొని ఉంచాడు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. ఇక ఆయన ఎన్నో వందల చిత్రాలకు కథలను, స్క్రిప్ట్‌లను తయారుచేసుకుని భవిష్యత్తులో తీయాలని భావించాడు.
వాటిలో 'ఎమ్మెల్యే ఏడుకొండలు.. మరలా వచ్చిండు' అనే పొలిటికల్ సెటైర్ ఫిల్మ్ ఒకటి. దానిని కూడా ఆయన తీయలేకపోయాడు. 2011లో ఆయన సహధర్మచారిణి పద్మ మరణం ఆ వయసులో దాసరిని బాగా కలత పెట్టింది. చివరకు ఆయన్ను కూడా తనలో సొంతం చేసుకుంది.