తన 50కి పైగా ఏళ్ల సినీప్రస్థానంలో అత్యధికంగా 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన తన సినీ కెరీర్‌లో దర్శకునిగా, నటునిగా, మాటల, పాటల, కథా రచయితగా, తారకప్రభు పతాకంపై నిర్మాతగా.. 24శాఖలలోనూ రాణించారు. ఆయన గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కడమే కాదు... ఆయన తనకున్న బహుముఖ ప్రజ్ఞతో రాజకీయ నాయకునిగా, రాజ్యసభ ఎంపీగా, మాజీకేంద్రమంత్రిగా ఇలా తాను అడుగిడిన ప్రతి రంగంలోని విశేష ప్రతిభ చూపించారు.
ఇక ఆయన తయారు చేసిన శిష్యులను దేశంలోని ఏ ఇతర దర్శకుడు తయారుచేయలేదంటే అతిశయోక్తికాదు. ఆయన శిష్యులెందరో కూడా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి తమ గురువు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇక పత్రికాధిపతిగా కూడా ఆయన ఎంతో సుప్రసిద్దుడు. ఆనాడు 'ఈనాడు' పత్రికకు పోటీగా 'ఉదయం' దినపత్రికను స్థాపించి ఎన్నో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టి ఒకానొక సమయంలో ఈనాడు పత్రిక కూడా ఉదయం పంథాను అనుసరించేలా చేశారు.
ఇక 'బొబ్బిలిపులి' అనే రాజకీయ పత్రికను, మేఘసందేశం,శివరంజనీ' వంటి సినీ పత్రికలను కూడా నడిపారు. 'రచ్చబండ', 'చాకిరేవు' అనే పేర్లతో పత్రికలను తేవడానికి విశేష కృషి చేశారు. ఒకానొక పరిస్థితిలో ఆర్ధిక పరిస్థులు బాగా లేక 'ఉదయం' దినపత్రికను మాగుంట సుబ్బరామిరెడ్డిగారికి ఇచ్చివేశారు. సుబ్బరామిరెడ్డితో పాటు తనకు కాస్త పరిచయం ఉన్న వారు దూరమైనా కూడా ఆయన విలవిలలాడిపోతారు.
తెలుగు సినీ ఫీల్డ్‌లోని అందరూ, చివరకు జర్నలిస్ట్‌లు కూడా దాసరిని మేస్త్రీ, గురువు గారూ అని భక్తితో, గౌరవంగా పిలిచేవారు. ఇక ఆయన సినీ రంగంలో ఎందరో నటీనటులను పరిచయంచేశారు. మోహన్‌బాబు నుంచి ఆర్.నారాయణమూర్తి వరకు ఆయన అందించిన శిష్యులు ఎందరో ఉన్నారు. ఆయన ప్రస్థానాన్ని గమనిస్తే దా'సరి' సరిరావు నీకెవ్వరూ అనిపించకమానదు.