ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు (75 ) మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాసరి మరణం సినీ రాజకీయ రంగాలకు తీరని లోటుగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. దాసరి 1942 మే 4 న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. సినీపరిశ్రమ హైదరాబాద్ తరలిరావడానికి దాసరి చేసిన కృషి ఎప్పటికి మరువలేనిది. అలాగే చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో పాటుపడ్డారు. 151 చిత్రాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గా దాసరి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. 53 చిత్రాలకు నిర్మాతగా చేసిన ఆయన 250 చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం 'తాత మనవడు', చివరి చిత్రం 'ఎర్రబస్సు'. రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ , తొమ్మిది స్టేట్ నంది అవార్డ్స్ మరియు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ దక్షిణాది నుండి దాసరి అందుకున్నారు.
దాసరి మరణంతో ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతికి గురై ఒక మంచి మిత్రుణ్ణి కోల్పాయానని... దాసరి కుటుంభం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దాసరి మరణం సినీపరిశ్రమకు తీరని లోటని.... రాజకీయాలకు దాసరి చేసిన సేవలు మరువలేవని.... ఆయన మరణం కలిచివేసిందని పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా దాసరి మరణం సినిమా పరిశ్రమకి తీరనిలోటని... చలన చిత్ర పరిశ్రమ దాసరిని పెద్దన్నగా భావిస్తారని... దర్శకరత్నగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా దాసరిని అభివర్ణించిన వెంకయ్యనాయుడు... దాసరి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేసారు.
దాసరి మరణ వార్త విని నేను షాక్ అయ్యా... ఆయన మరణం నన్ను కలిచి వేస్తుందని పేర్కొన్నారు చైనా పర్యటనలో వున్న చిరంజీవి. అలాగే పోర్చుగల్ లో షూటింగ్ లో వున్న బాలకృష్ణ కూడా దాసరి మరణానికి సంతాపం తెలియజేసారు. దాసరి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. దాసరికి అత్యంత ఆప్తమిత్రుడు అయిన మోహన్ బాబు, దాసరి మరణాన్ని జీర్ణించుకోలేక మీడియా ఎదుట భోరున విలపించారు. నాకు నటనాపరంగా జన్మనిచ్చిన దేవుడు కన్నుమూయడం తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సినిమా పరిశ్రమ ఒక మూల స్తంభాన్ని కోల్పోయిందని దర్శకుడు కె రాఘవేంద్ర రావు అన్నారు. ఇక కమల్ హాసన్, రజినీకాంత్ సినిమారంగం గొప్ప నటుడిని కోల్పోయిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ దర్శకుల సంఘం దాసరికి ఘన నివాళి అర్పించింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మా కులపెద్ద కన్నుమూత మాకు తీరని లోటు. మా దర్శకుల పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన ప్రతిభాశాలి దాసరి గారి మరణం మా దర్శకులకు మాత్రమే కాక తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నానని స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను..అని రామ్ చరణ్ తెలిపారు. ఇంకా దాసరి మరణ వార్త విన్న ప్రతి కళాకారుడు ఎంతో తీవ్ర ద్రిగ్భాంతి కి లోనయ్యారు. పవన్ కళ్యాణ్, వి వి వినాయక్, సుకుమార్, సంపత్ నంది, శివాజీ రాజా, నరేష్, బోయపాటి శ్రీను, శ్రీవాస్, గోపీచంద్, నాగసౌర్య, సాయి కొర్రపాటి, నారా రోహిత్, పి వి పి, చందు మొండేటి, చదలవాడ శ్రీనివాస రావు, విజయ్ దేవరకొండ, ఎన్ శంకర్, తేజ, శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు విష్ణు, మంచు మనోజ్, క్రాంతి మాధవ్, రాజ్ కందుకూరి, రాజశేఖర్, జీవిత, సూర్యదేవర రాధా కృష్ణ, బండారు దత్తాత్రేయ, శ్రీవిష్ణు, రవిబాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి, సుధీర్ వర్మ, పి. రామ్మోహన్ రావు, అశ్వినీ దత్ మొదలగు వారందరు దాసరి మృతి పట్ల ఎంతగానో బాధకు లోనయ్యారు. దాసరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.
తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దాసరి మరణం మనందరికీ తీరని లోటని.... ఆయన భౌతికకాయాన్ని కిమ్స్ నుండి దాసరి స్వగృహానికి తరలించి బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహిస్తామని తెలిపారు. దాసరి మరణంతో తెలుగు సినిమా మూగబోయింది.... దాసరి ఆత్మకి శాంతి చేకూరాలని బుధవారం సినిమా ఇండస్ట్రీ బంద్ నిర్వహిస్తున్నట్లు నిర్మాత సి కళ్యాణ్ ప్రకటించారు.