కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు. స్వీయ నిర్మాణ సంస్థపై ద్వితీయ ప్రయత్నంగా సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఇషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో వున్నాయి. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరిస్తుంది. కథలోని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. నవ్యమైన అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో చిత్రీకరరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 22న ఓ ప్రముఖ స్టార్ హీరో చేతులమీదుగా టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేస్తున్నాం అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సుకుమార్‌తో పాటు బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి అడూరి, రవిచంద్ర నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.