కళాతపస్వి కె.విశ్వనాథ్ కు అత్యున్నత సినీపురస్కారం
కళాతపస్వి కె.విశ్వనాథ్ కు అత్యున్నత సినీపురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ రంగానికి కె విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఇంత అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. విశ్వనాథ్… దర్శకుడిగా, నటుడిగా సినీరంగంపై చెరగని ముద్ర వేశారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను కనువిందు చేసిన విశ్వనాథ్.. ఇప్పటికే 6 నంది అవార్డులు, 10 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.
1957లో సౌండ్ విభాగంలో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ‘సిరి సిరి మువ్వ’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. విశ్వనాథ్ చిత్రాల్లో ‘శంకరాభరణం’ సినిమా ఓ మైల్ స్టోన్. ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది ఈ సినిమా. ‘సాగర సంగమం’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’.. ఇలా విశ్వనాథ్ కెరీర్ లో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ‘స్వాతిముత్యం’ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది.
భారతీయ సినిమాకు విశ్వనాథ్ చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కుటుంబ విలువలతో పాటు, సామాజిక సందేశాలు, సాంస్కృతిక కళలను ప్రతిబింబించేలా సినిమాలను తెరకెక్కించే విశ్వనాథ్ గారు.. కేవలం ఉత్తమ దర్శకుడిగానే కాకుండా, మహోన్నత వ్యక్తిగా నిలిచారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని వచ్చేనెల 3వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు విశ్వనాథ్.