'వైశాఖం' సాంగ్స్, విజువల్స్ చాలా బాగున్నాయి.. సినిమా చాలా పెద్ద హిట్‌కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - సూపర్‌స్టార్ మహేష్
'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'వైశాఖం'. ఆర్.జె. సినిమాస్ పతాకంపై హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి డి.జె. వసంత్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 16న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రముఖులు, అతిథుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా విచ్చేయగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మైత్రి మూవీస్ అధినేత వై. రవిశంకర్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దర్శకుడు మెహర్ రమేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. హీరో హరీష్, హీరోయిన్ అవంతిక, సంగీత దర్శకుడు డి.జె. వసంత్, నటుడు కాశీ విశ్వనాధ్, కమెడియన్ భద్ర, గుండు సుదర్శన్, కెమెరామెన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, ఆర్ట్ డైరెక్టర్ మురళి కొండేటి, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర, లైన్ ప్రొడ్యూసర్ బి. శివకుమార్, నిర్మాత బి.ఎ. రాజు, ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా, నిరంజన్ తదితరులు వేదికపై పాల్గొనగా డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. ఫ్లవర్ బొకేలతో అతిథులందర్నీ స్వాగతించారు. కార్యక్రమానికి ముందు 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. అనంతరం 'వైశాఖం' ఆడియో సీడీని సూపర్‌స్టార్ మహేష్ రిలీజ్ చేసి తొలి సీడీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. పాటలు విన్నవారందరూ పాటలు చాలా బావున్నాయని, విజువల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉందని యూనిట్‌ను అప్రిసియేట్ చేశారు. ఈ సందర్భంగా....
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ - ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు గారు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 'వైశాఖం' పాటలు, విజువల్స్ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్, అవంతిక, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్దహిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది!!
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - చైత్రమాసంలో వసంత రుతువు వస్తుందని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుంది. 'వైశాఖం'లాంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జయ గారికి, రాజుగారికి నా అభినందనలు తెలియచేస్తున్నాను.. అన్నారు.
వారిద్దరి తర్వాత జయగారే!!
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - భానుమతి, విజయనిర్మల గారి తర్వాత మహిళా దర్శకుల్లో జయగారే. రాజుగారు, జయగారు ప్యాషన్‌తో సినిమాలు తీస్తారు. హరీష్, అవంతికలతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. 'వైశాఖం' బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది.. అన్నారు.
సాంగ్స్ అన్నీ విజువల్‌గా బాగా వచ్చాయి!!
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ - ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం సౌత్ ఇండియా సూపర్‌స్టార్ మహేష్‌బాబే కారణం. రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ మహేష్‌బాబు. ఆయన వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. చాలా బాగా జరిగింది. మహేష్‌బాబు, మురుగదాస్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి టోటల్ ఇండియా రికార్డ్స్ అన్నీ క్రాస్ చేసి చాలా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాకున్న కోరికల్లో నా ఫస్ట్ కోరిక అది. తర్వాతే మా 'వైశాఖం'. నాకు చాలా చాలా ఇష్టమైన రైటర్ త్రివిక్రమ్ గారు. ఆయన సినిమాలు సాధారణంగా 2, 3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్‌గా చూస్తాను, రెండు ఆయన డైలాగ్స్ కోసం. మూడు ఆయన డైలాగ్స్ పేర్చిన విధానం, ఆ సినిమా తీసే టెక్నిక్ పట్టుకోవాలని చూస్తాను. మా రైటర్స్‌ని త్రివిక్రమ్ గారిలా ఒక్క డైలాగ్ అన్నా రాయండని చెప్తుంటాను. అది మా వల్లకాలేదు. 'వైశాఖం'లో కూడా ట్రై చేశాం. సినిమా చూస్తే అందరికీ అర్ధం అవుతుంది. ఎక్కడ ట్రై చేశామో. మేము ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం. త్రివిక్రమ్ గారు మాత్రం ఇంకా హైట్స్‌కి వెళ్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ మోస్ట్ ఇన్‌స్పైరింగ్ రైటర్ ఆయన. అలాగే వంశీ పైడిపల్లి అంటే ఫస్ట్ నుండి నాకు ఇష్టం. ముఖ్యంగా 'ద ఇన్‌టచ్‌బుల్' ఇంగ్లీషు సినిమాని నేను చాలాసార్లు చూశాను. ఆ సినిమాని వంశీ ఎలా తీయగలడు, ఎలా మౌల్డ్ చేయగలడు అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా 'ఊపిరి' చిత్రాన్ని తీశారు వంశీ పైడిపల్లి. టాప్ లెవల్‌లో ఆయన టాలెంట్‌ని చూపించారు. ఆయన నెక్ట్స్ సినిమా ఇంకా టాప్ లెవల్‌లో ఉంటుందని మహేష్‌బాబుగారు చెప్తున్నారు. ఆ సినిమా త్వరలోనే చూస్తాం. డి.జె. వసంత్‌తో చాలా డిఫరెంట్‌గా సాంగ్స్ చేయించాననే నమ్మకం నాకుంది. సుబ్బారావుని ఈ సినిమా ద్వారా కెమెరామెన్‌గా ఇంట్రడ్యూస్ చేశాం. స్టార్టింగ్ నుండి డిఐ వరకు ఏదీ వదలకుండా కమిటెడ్‌గా, చాలా డెడికేటెడ్‌గా వర్క్‌చేస్తారు. హీరో హరీష్, హీరోయిన్ అవంతిక ఇద్దరూ కొత్తవాళ్లే. వాళ్లతో శేఖర్ మాస్టర్ మంచి డాన్స్ చేయించారు. యాక్టింగ్‌వైజ్‌గా ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించారు. నేను ఎలాగైతే రావాలనుకున్నానో అలాగే చేశారు. ఈ సినిమా తర్వాత హీరో, హీరోయిన్‌కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటికే అందరూ వారిద్దర్నీ సినిమా చేయమని అడుగుతున్నారు. కానీ 'వైశాఖం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 'వైశాఖం' రిలీజ్ తర్వాత ఇద్దరు సూపర్‌స్టార్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల చాలా మంచి లిరిక్స్ రాశారు. అలాగే శ్రీమణి కూడా మంచి పాటలు రాశారు. ఫస్ట్ అతను గాయకుడుగా మా ఆఫీస్‌కి వచ్చారు. కథ విని ఇన్‌స్పైర్ అయి మంచి పాటలు రాశారు. నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇమీడియట్‌గా రాసి ఇచ్చేవారు. ఈ సినిమాతో ఒక ఆత్మీయ మిత్రుడిగా మిగిలిపోయారు శ్రీమణి.. అన్నారు.
ఆదిత్య గుప్తా మాట్లాడుతూ - జయగారి డైరెక్షన్‌లో రాజుగారు నిర్మించిన అన్ని సినిమాలు మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 'వైశాఖం' కూడా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియోతో పాటు సినిమా మ్యూజికల్‌గా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ - 'వైశాఖం' నాకు చాలా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన రాజుగారికి నా థాంక్స్. జయ మేడంగారంటే నాకు చాలా చాలా ఇష్టం. బ్యూటిఫుల్‌గా ఈ చిత్రాన్ని తీశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతో హార్డ్‌వర్క్ చేశారు. ఈ సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.. అన్నారు.
సంగీత దర్శకుడు డి.జె. వసంత్ మాట్లాడుతూ - సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అయి మా రాజుగారికి మరిన్ని డబ్బులు రావాలి. ఈ సినిమాకి వర్క్‌చేసిన ప్రతి ఒక్కరికీ మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
కెమెరామెన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - సూపర్‌స్టార్ కృష్ణగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. చిన్నప్పుడు నా రూమ్‌నిండా ఆయన ఫొటోలే ఎక్కువగా ఉండేవి. వారి అబ్బాయి సూపర్‌స్టార్ మహేష్ ఈ ఆడియో ఫంక్షన్‌కి రావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ - నాలాంటి కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి సూపర్‌స్టార్ మహేష్‌గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీమ్‌ని బ్లెస్ చేయడానికి వచ్చిన త్రివిక్రమ్‌గారికి, వంశీ పైడిపల్లి గారికి నా థాంక్స్. నా వెన్నుతట్టి 'వైశాఖం'తో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న జయగారికి, రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శేఖర్ మాస్టర్ అన్ని పాటలకి మంచి కొరియోగ్రఫి కంపోజ్ చేశారు. నాతో మంచి స్టెప్స్ వేయించారు. బాగా చేశాననే అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సుబ్బారావు మంచి ఫొటోగ్రఫి అందించారు. విజువల్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. వసంత్ మంచి ట్యూన్స్ అందించారు. పెద్ద హీరోలకి చేసినట్లుగానే మంచి సాంగ్స్ ఇచ్చారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను..అన్నారు.
పాటల రచయిత శ్రీమణి మాట్లాడుతూ - నేను చదువుకునే రోజుల్లో 'చంటిగాడు' సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. పాటలు విని చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. జయగారి డైరెక్షన్‌లో వస్తున్న 'వైశాఖం' సినిమాకి పాటలు రాయడం చాలా హ్యాపీగా ఉంది. వసంత్ మంచి ట్యూన్స్ కంపోజ్ చేశారు. బెస్ట్ ఆల్బమ్ అని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
మహేష్‌ది గోల్డెన్ హ్యాండ్!!
నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ - ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా జరిగింది అంటే మహేష్‌బాబు గారే కారణం. షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్ చేశాం. ఆరూ హిట్ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్..అన్నారు.