'మాస్ మహారాజా' రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా , లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం (ఫిబ్రవరి 3) హైదరాబాద్‌లో జరిగింది. హీరో రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. వారం రోజులకు పైగా ఇక్కడే తొలి షెడ్యూల్ చేయనున్నాం. తదుపరి షెడ్యూలు పాండిచ్చేరిలో 25 రోజులు చేయనున్నాం. మాస్ మహారాజా రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ మంచి కథను తయారుచేశారు... అని తెలిపారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారని దర్శకుడు విక్రమ్ సిరికొండ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: జామ్8, ఫైట్స్: పీటర్ హెయిన్, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, మాటలు: శ‌్రీనివాసరెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ వంక, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.