మెగాస్టార్ - పవర్ స్టార్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి భారీ చిత్రం..!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలనివుంది అని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ మూవీని సుప్రసిద్ధ నిర్మాత,ఎం.పి, కళా బంధు డా. టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ భారీ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.
గత కొన్ని దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటిన మెగాస్టార్ ఇటీవల 150 సినిమా ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆత్మీయ సత్కారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్, పవర్ స్టార్ తో సినిమా చేస్తానని ఎనౌన్స్ చేసారు. ఆ తర్వాత మెగాబ్రదర్స్ ను సుబ్బిరామిరెడ్డి పర్సనల్ గా కలిసి ఈ సినిమా చేసేందుకు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నిర్మాత కళా బంధు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ....గతం లో మెగాస్టార్ చిరంజీవితో 'స్టేట్ రౌడీ' వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించాను. అప్పట్లో ఆ చిత్రం నైజామ్ ప్రాంతం లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అలాగే శోభన్ బాబు, రజనీకాంత్ లతో 'జీవనపోరాటం', యువరత్న బాలకృష్ణ తో 'వంశోద్ధారకుడు', విక్టరీ వెంకటేష్ , అర్జున్,నరేష్ లతో 'త్రిమూర్తులు', 'సూర్య ఐ.పి.ఎస్.' మరియు సంస్కృతంలో 'భగవద్గీత' వంటి తదితర చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా నిర్మించనున్నాను అని సంతోషంగా తెలియచేస్తున్నాను. అరుదైన ఈ కాంబినేషన్ ఇది . మెగా బ్రదర్స్ ఇద్దరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే డైరెక్ట్ చేయగలరనేది నా నమ్మకం. త్రివిక్రమ్ ని ఈరోజు కూడా కలిసి చర్చించటం జరిగింది. ఆయన కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాను. త్వరలోనే ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను మీడియాతో పంచుకోవటం జరుగుతుందని టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.