తొలిరోజు వసూళ్లలో ఇండస్ట్రీ హైయ్యెస్ట్ గ్రాసర్ `ఖైదీనంబర్ 150`, వరల్డ్‌వైడ్ 47.7 కోట్లతో రికార్డ్ సాధించింది - నిర్మాత అల్లు అరవింద్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మించిన `ఖైదీనంబర్ 150` ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అసాధారణ వసూళ్లతో దూసుకుపోతోంది.
ఖైదీనంబర్ 150 తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కార్యాలయ ఆవరణలో అల్లు అరవింద్ మాట్లాడుతూ -`ఈ సినిమా 47.7 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డును అందుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిరోజు 30 కోట్ల 45 వేలు వసూలు చేసింది. కర్నాటక -4.70 కోట్లు, ఓవర్సీస్ (అమెరికా) - 1.22 మిలియన్ డాలర్లు, అమెరికా మినహా మిగతా చోట్ల 3,20,000 డాలర్లు, నార్త్ అమెరికా-8.90 కోట్లు, ఇతర భారతదేశంలో 2.12 కోట్లు, ఒరిస్సా-12 లక్షలు, తమిళనాడు-20లక్షలు వసూలు చేసింది. ఇతరచోట్ల ఓ 58లక్షల వసూళ్లు దక్కాయి` అని తెలిపారు.
మరిన్ని సంగతులు ముచ్చటిస్తూ -`దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఆయన ఎలా ఉన్నారో చూడాలన్న ఉత్సాహంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకు వస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులు, అభిమానులు, పరిశ్రమవర్గాలు ఆసక్తిగా ఈ సినిమాని వీక్షించేందుకు వేచి చూశారు. అందుకే తెలుగు సినిమాల్లో మొదటిరోజు హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మూవీగా నిలిచింది. చిరు కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ఇది అందరితో పంచుకోవాలనే మీడియా ముందుకు వచ్చాను. మన తెలుగు డయాస్పోరా (తెలుగువారి విస్తరణ) ప్రపంచమంతా ఎలా పెరుగుతోందో తెలుసుకోవడానికి .. మెగాస్టార్ తిరిగి వస్తున్న శుభసందర్భంలో ఆయనపై ప్రేమ ఉదృతాన్ని ఇది చెబుతోంది. దాదాపు 2000 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశాం. సినిమా కథాంశాన్ని మించి చిరంజీవి కంబ్యాక్ వెయిటేజీ చూడాలనే జనం థియేటర్లకు వచ్చారని నేను నమ్ముతాను. ఓవర్సీస్‌లోనూ రియాక్షన్ పెద్ద పండుగలా ఉంది. చిరంజీవి గారిని చూడాలని సెలవులు పెట్టి మరీ థియేటర్లకు వచ్చారు. మస్కట్‌లో తెలుగువారికి కంపెనీలు సెలవులిచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని రామ్‌చరణ్ నిర్మించడానికి ప్రత్యేక కారణం ఉంది. ఐదేళ్లుగా మెగాస్టార్ ఇంట్లో ఓ బ్యానర్‌ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా సరైన వేదిక ఈ 150వ సినిమా అనిపించి రామ్‌చరణ్ ప్రారంభించారు` అని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి దర్శకుడిగా అనుకున్నాం. కానీ బోయపాటితో కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. కథ సుమారుగానే సిద్ధమైంది. ఇంత పెద్ద హిట్ తర్వాత భయం వేసింది. జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను వేచి చూస్తున్నా. ఆర్నెళ్లపాటు బాగా వచ్చాకే చేయాలన్నది ఆలోచన. ఈలోగానే చరణ్ వేరొక సినిమా చిరంజీవితో చేస్తారు. అయితే 151వ సినిమా డైరెక్టర్‌గా సురేందర్‌రెడ్డి పేరు వినిపించడం సహజం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఎంపిక చేసిన కథలతో పాటు పరిశీలనలో ఉంది. .. అనీ బాస్ 151వ సినిమా గురించి అరవింద్ వివరణ ఇచ్చారు.