చిన్న చిత్రాలు అద్భుతాల్ని సృష్టిస్తుంటాయి. యూత్‌నే లక్ష్యంగా చేసుకొని తెరకెక్కే ఆ చిత్రాల్లోని కంటెంట్ కొన్నిసార్లు ప్రేక్షకులకి భలే కనెక్టవుతుంటుంది. అలా చాలా సినిమాలు ప్రేక్షకుల్ని అలరించి వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రముఖ దర్శకుడు మారుతి మొదట్లో తీసిన సినిమాలన్నీ ఆ తరహాకి చెందినవే. ఇప్పుడు ఆయన శిష్యులు వాటిపై దృష్టిపెట్టారు. అయితే ఈరోజుల్లో, బస్‌స్టాప్ తరహాలో ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. కానీ మేకర్లు మాత్రం ఆ ప్రయత్నాలు మానడం లేదు. తరచుగా యూత్ బేస్డ్ సినిమాలు తెరకెక్కతున్నాయి. వాటి కోవలోనే తెరకెక్కి ఇటీవల ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది 'అమీర్‌పేటలో... '. ఉన్నత చదువులు, ఉద్యోగాలే లక్ష్యంగా అమీర్‌పేటలో వాలిపోయే యూత్‌ని బేస్ చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. శ్రీ అనే కథానాయకుడు స్వయంగా తెరకెక్కించాడు. అశ్విని కథానాయికగా నటించింది. ఈ నెల 16న ఆంధ్ర, తెలంగాణలోనూ, 15న అమెరికాలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కొంతకాలం కిందటే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. దాంతో ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మయూరి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. కథలో సాఫ్ట్‌వేర్ నేపథ్యం కూడా ఉండటం, అమీర్‌పేట్ అంటే అమెరికాలో ఉన్న ప్రవాసులకి కూడా బాగా తెలియడం వంటి కారణాలతో ఈ సినిమాని ఓవర్సీస్‌లోనూ పెద్దయెత్తున విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చాలా థియేటర్లలో సినిమా విడుదలవుతోంది.