నవరస సమ్రాట్ నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ రాజు గారి గది 2. ఈ చిత్రాన్ని పి.వి.పి & మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ హర్రర్ థ్రిల్లర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఓంకార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...ఊపిరి తర్వాత మా సంస్థలో చేస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నాగార్జున గారి కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నాగార్జున గారి సూచనలతో స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేసాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. ఖచ్చితంగా రాజు గారి గది 2 బిగ్ హిట్ అవుతుంది అన్నారు.
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ....నాగార్జున గారితో ఫస్ట్ డాన్ సినిమాకి వర్క్ చేసాను. ఆతర్వాత ఊపిరి...ఇప్పుడు రాజు గారి గది 2 చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.నాగార్జున గారు ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఆయన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుంది అనేది నా నమ్మకం అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ....ఈ మూవీకి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. బలుపు తర్వాత పి.వి.పి సంస్థలో నేను చేస్తున్న సినిమా ఇది. ఓంకార్ సూపర్ స్ర్కిప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు.
డైరెక్టర్ ఓంకార్ మాట్లాడుతూ...గత సంవత్సరం దసరాకు అక్టోబర్ 27న రిలీజ్ చేసిన రాజు గారి గది సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కరెక్ట్ ఈ సంవత్సరం అదే రోజున అక్టోబర్ 27న నాగ్ సార్ కి కథ చెప్పాను. కథ విన్న వెంటనే ఓకే అన్నారు. ఇదంతా దేవుడి దయ వలన జరిగింది అని నమ్ముతున్నాను. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను చాలా కష్టపడి ఈస్ధాయికి వచ్చాను. ఇప్పటి వరకు చూడని నాగార్జున గారిని ప్రజెంట్ చేస్తున్నాను. నా పై పి.వి.పి గారు, నాగ్ సార్ ఉంచిన నమ్మకాన్ని నిలబడతాను అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ...నా కెరీర్‌లో `మనం` ఓ టర్న్. తర్వాత `ఊపిరి`, `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో సక్సెస్ కొట్టాను. నెక్ట్స్ ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు `ఓం నమో వేంకటేశాయ` సినిమా అవకాశం రావడం, అందులో నటించడం జరిగింది. తర్వాత ఏ సినిమా చేయాలనుకుంటున్న సమయంలో ఓంకార్ దగ్గర ఓ మంచి కథ ఉందని నిరంజన్, పివిపిగారు నన్ను కలిసి కథ వినమన్నారు. కథలో కొత్తదనం ఉంటేనే చేస్తానని వారితో అన్నాను. కథ వినగానే బాగా నచ్చింది. నాకు ఇష్టమైన థ్రిల్లర్ జోనర్ మూవీ. ఇప్పటి వరకు ఇలాంటి కథలో నేను నటించలేదు. `రాజుగారి గది` సినిమా చూడలేదు. అయితే ఓంకార్ గురించి బాగా తెలుసు. గతంలో తనతో కలిసి ఓ గేమ్ షో చేయాల్సింది. కానీ కుదరలేదు. తనపై నాకు నమ్మకం ఉంది. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా తరహాలో నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఊపిరి సినిమా కథ విని సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎగ్జయిట్‌మెంట్ ఫీలయ్యానో `రాజుగారి గది2` సినిమా కథ వినగానే ఎప్పుడెప్పుడు సినిమా చేయాలా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో మనుషులతో అడుకునే క్యారెక్టర్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది.. అన్నారు.
అక్కినేని నాగార్జున, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - దివాకరన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ - అబ్బూరి రవి, నిర్మాత - పి.వి.పి, దర్శకత్వం - ఓంకార్.