సినిమా చూడడం కాలక్షేపం. ధియేటర్ లో చూడడం సరదా. విడుదలైన రోజే చూడడం ఆనందం, విడుదలకి ముందు చూడడం ఓ వేడుక.
ప్రముఖులకు మాత్రమే ఇప్పటివరకు పరిమితమైన ఈ వేడుక ఇప్పుడు సామాన్యులకి కూడా సొంతం కానుంది.
ఈ నెల విడుదలవుతున్న జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాన్ని రెండ్రోజుల ముందే పబ్లిక్ ప్రీమియర్ ద్వారా సగటు సినీ ప్రేమికులకు చూపిస్తామంటున్నారు జయమ్ము నిశ్చయమ్మురా దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి.
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాన్ని విడుధలకు రెండు రోజుల ముందే ఆంధ్ర, తెలంగాణా, అమెరికా మరియు లండన్ లలో ఉచితంగా చూపించబోతున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, చిత్ర కథానాయుకుడు శ్రీనివాస్ రెడ్డి, ఈ చిత్రం ప్రదర్శన హక్కులు సొంతం చేసుకొన్న ఎన్ కే ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి, చిత్ర సమర్పకులు ఏ వి యస్ రాజు, ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ పాల్గొన్నారు.
ఈ నెల 23న హైదరాబాద్ శాంతి ధియేటర్ లో రాత్రి
9 గంటలకు, అమెరికా కాలిఫోర్నియాలోని సెర్రా ధియేటర్, మరియు చికాగోలోని మూవీ మాక్స్ ధియేటర్ లో జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని.. ఈ నెల 24న రాత్రి 9 గంటలకు విజయవాడ కాపర్తి ధియేటర్ లో, లండన్ లోని బోలేయ్న్ సినిమా ధియేటర్ లో పబ్లిక్ ప్రీమియర్ షోస్ ఉచితంగా వేస్తున్నామని శివరాజ్ కనుమూరి తెలిపారు.
విడుదలకు రెండు రోజులు ముందే పబ్లిక్ ప్రీమియర్ షోస్ వేస్తుండడం జయమ్ము నిశ్చయమ్మురా సాధించబోయే సంచలన విజయంపై దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరికి గల నమ్మకాన్ని తెలుపుతోందని చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ చిత్రం తనకు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని రవి వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం శివరాజ్ కనుమూరి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుందని చిత్ర సమర్పకులు ఏ వి యస్ రాజు అన్నారు.
జయమ్ము నిశ్చయమ్మురా వంటి ఒక గొప్ప చిత్రాన్ని విడుదల చేస్తుండడం తనకు ఎంతో గర్వంగా ఉందని నీలం కృష్ణారెడ్డి పేర్కొన్నారు.