క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్ అనే వెరైటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న చిత్రం కేరాఫ్ గోదావరి. రోహిత్.ఎస్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూవీస్ సమర్పణలో ఆర్.ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్-బొమ్మన ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తూము రామారావు(బాబాయ్)-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రైటర్ మోహన్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన ప్రముఖ రచయిత రాజా రామ్మోహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోహిత్ సరసన శ్రుతివర్మ, దీపు నాయుడు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం సమకూర్చారు.
కుంచే కార్డ్స్ పేరిట మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేసిన రఘు కుంచే.. కేరాఫ్ గోదావరితో తన కంపెనీకి శ్రీకారం చుట్టడం విశేషం. భాస్కరభట్ల, బానిశెట్టి సురేష్, బండి సత్యంలతో పాటు చిత్ర దర్శకులు రాజా రామ్మోహన్ కేరాఫ్ గోదావరి చిత్రానికి సాహిత్యం సమకూర్చారు.
కుంచే కార్డ్స్ ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్న కేరాఫ్ గోదావరి గీతాలు హైదరాబాద్ లోని దుర్గం చెరువు వేదికగా ఏర్పాటు చేసిన వేడుకలో విడుదలయ్యాయి.
శిల్పా చౌదరి వ్యాఖ్యాతగా.. అత్యంత వైభవంగా, పలు వినోద కార్యక్రమాలతో ఆహుతులను అమితంగా అలరిస్తూ ఆహ్లాదభరితంగా జరిగిన ఈ వేడుకలో.. సినిమా రంగంతోపాటు వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాలుపంచుకొని కేరాఫ్ గోదావరి యూనిట్ సభ్యులకు శుభాభినందనలు తెలుపుతూ చిత్రం ఘాన విజయం సాధించాలని కోరుకున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ, నేతి విద్యాసాగర్, రసమయి బాలకిషన్, ఆకెళ్ళ రాఘవేంద్రరావు, రవీందర్, మల్కాపురం శివకుమార్, దేవీప్రసాద్ లతోపాటు.. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన సుమన్, మధుమణి, జెమిని సురేష్, షాని తదితర చిత్రబృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రఘు కుంచే స్వరపరిచిన పాటలన్నీ చాలా బాగున్నాయని, ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద స్థాయిలో హిట్టయ్యే సినిమా అనిపిస్తోందని అతిధులు పేర్కొన్నారు. హీరోగా పరిచయమవుతున్న రోహిత్ బోయ్ నెక్స్ట్ డోర్లా చాలా నేచురల్ నటించినట్లుగా ఉందని.. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం తొలి ఆడియో సీడీని స్వీకరించడానికి నిర్మాతలకు చెందిన పలువురు స్నేహితులు, శ్రేయోభిలాషులు పోటీ పడడంతో.. వేలం పాట నిర్వహించగా.. శ్రీమతి చంద్రకుమారి లక్షా ఇరవై అయిదు వేలకు పాడుకొని.. కేరాఫ్ గోదావరి ఆడియో తోలి సీడీని హీరో సుమన్ చేతుల మీదుగా అందుకున్నారు.
కేరాఫ్ గోదావరి వంటి ఓ గొప్ప చిత్రంతో తనను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాతలకు, దర్శకుడికీ హీరో రోహిత్ కృతజ్ఞతలు తెలుపగా.. రోహిత్ నటన, రఘు కుంచే సంగీతం, అవినాష్ ఎడిటింగ్, మురళీవర్మ సినిమాటోగ్రఫీ కేరాఫ్ గోదావరి చిత్రానికి ప్రధాన ఆకర్షణలని నిర్మాతలు పేర్కొన్నారు. నాని, శర్వానంద్ తరహాలో రోహిత్ కూడా మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటాడని వారు అన్నారు.
చాలా ముందుగా అమెరికాలో ఫిక్స్ అయిన మ్యూజిక్ కాన్సెర్ట్స్ చేస్తూ.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రఘు కుంచే.. కేరాఫ్ గోదావరి తన కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్ గా నిలిచిపోతుందని చెప్పారు.
పోసాని, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, కోటేశ్వరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తాళ్ల వెంకట రెడ్డి, నిర్మాతలు: తూము రామారావు(బాబాయ్),-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల, కథ-మాటలు-ఒక పాట-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజా రామ్మోహన్ !!