సంక్రాంతి పందెంకోళ్ళు చిరంజీవి, బాలకృష్ణల మధ్య పోటీ ఖరారైంది. ఈ స్టార్స్ ఒకే రోజు బరిలో దిగితే! ఏం జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఒకటి చారిత్రక నేపథ్యం ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి, మరొకటి రైతుల సమస్యలపై తీస్తున్న ఖైదీ నంబర్ 150. ఈ రెండూ పరస్పర విరుద్దమైన కథా చిత్రాలు. ఒకే రోజు రిలీజైతే భారీ ఓపనింగ్స్ నమోదు చేస్తాయి. ఆ తర్వాత బాగున్న సినిమా నిలదొక్కుకుంటుంది. అయితే చిరంజీవి సినిమా మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేవలం ఓపనింగ్స్ ను దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నారా? లేక పోటీలో ముందుగానే బరిలో దిగాలనా అనేది చిత్ర యూనిట్ స్పష్టం చేయడం లేదు. ఓపనింగ్స్ అని చెబితే మాత్రం అభిమానులు మరో విధంగా భావిస్తారు. పోటీ సినిమాతో పాటుగా వస్తేనే వారికి కిక్ ఉంటుంది.. జనవరి 11వ తేదీ బుధవారం. సహజంగా ఆరోజు కొత్త సినిమాల రిలీజ్ ఉండదు. గురు, శుక్రవారాల్లో మాత్రం రిలీజ్ చేస్తుంటారనే విషయం తెలిసిందే.. ఒక రోజు ముందుగా వస్తే మొదటివారంలో మరొక రోజు అదనంగా చేరుతుంది. స్టార్ హీరోల సినిమాలు మరీ దారుణంగా ఉంటే తప్ప మొదటివారం మంచి కలెక్షన్లు రాబడుతాయి. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి సినిమాకు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పరిణామం ఆసక్తి కలిగిస్తోంది.