Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (3-9-16)..!

Sun 04th Sep 2016 07:19 PM
welfare committee of maa press meet,bantipoola janaki,premam,idream media,chandu mondeti,vasudeva reddy,tollywood tazaa updates,tollywood tajaa updates,september 3rd  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (3-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (3-9-16)..!
Advertisement
Ads by CJ

1. 'మా' ఆర్టిస్టుల‌కు ఛాన్సులిచ్చి బ‌తకనివ్వండి- 'మా'- జాబ్ విభాగం

'మా' ఆర్టిస్టుల ఉపాధి క‌ల్ప‌న‌కు నిరంత‌రాయంగా అవ‌కాశాలిప్పేంచేందుకు మా ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) వెల్‌ఫేర్ క‌మిటి- జాబ్ విభాగం ప్రారంభ‌మైంది. మా స‌భ్యుల్లో నైపుణ్యం, అనుభ‌వం ఉండీ అవ‌కాశాల్లేక ఆర్థికంగా, మాన‌సికంగా కుంగుతున్న వారికి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా అవ‌కాశాలిచ్చి ఉపాధి కోల్పోకుండా కాపాడాల‌ని 'మా' అధ్య‌క్ష‌కార్య‌వ‌ర్గం ఈ సంద‌ర్భంగా కోరింది. 'మా' వెల్ఫేర్ క‌మిటీ చైర్మ‌న్ సీనియ‌ర్ న‌రేష్, 'మా' ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీరాజా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌, నిర్మాత సి.క‌ళ్యాణ్‌, హీరో శ్రీ‌కాంత్‌, 'రోషిణి' స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు, రంగారెడ్డి జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వై.వెంక‌య్య‌, 'వందేమాత‌రం' ఫౌండేష‌న్ వికాస్‌, ఏడిద శ్రీ‌రామ్‌, సురేష్ కొండేటి, హేమ‌,  గంగాధ‌ర్ పాండే, దేవేంద‌ర్, గౌతంరాజు, ల‌త‌ తదిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో 'మా' జాబ్ విభాగం మెంబ‌ర్స్‌, మా అసోసియేష‌న్ స‌భ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 'మా' జాబ్ విభాగం బ్రోచ‌ర్ ని స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ఆవిష్క‌రించారు. హీరో శ్రీ‌కాంత్‌, సి. క‌ళ్యాణ్‌లు బ్రోచ‌ర్‌ల‌ను అందుకున్నారు. అలాగే 350 మంది 'మా' మెంబ‌ర్ల‌కు సంబంధించిన ఎస్‌బిఐ ఇన్సూరెన్స్ ప‌త్రాల్ని జ‌య‌సుధకు శివాజీ రాజా అందించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ముఖ్య అతిధుల‌ను, మా స‌భ్యుల్ని సాలువాల‌తో స‌త్క‌రించారు. ఇదే వేదిక‌పై న‌టి 'బొమ్మ‌రిల్లు' సారిక పుట్టిన‌రోజు వేడుక‌లు మా స‌భ్య‌లు జ‌రిపించారు. 

అనంత‌రం 'మా' వెల్ఫేర్ క‌మిటీ చైర్మ‌న్‌, సీనియ‌ర్ న‌రేష్ మాట్లాడుతూ -ఉద్యోగులు, డాక్ట‌ర్లు, లాయ‌ర్ల‌కు ఉన్న గ్యారెంటీ ఉపాధి ఆర్టిస్టుల‌కు ఉండ‌దు. ఓసారి అవ‌కాశాలు పోతే మ‌ళ్లీ అంత తేలిగ్గా రావు. అందుకే మా మెంబ‌ర్లు, ఆర్టిస్టులంద‌రికీ అవ‌కాశాలు క‌ల్పించేలా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని కోర‌తాం. గౌతంరాజు ఇన్‌ఛార్జ్‌గా స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేశాం. ఈ టీమ్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, కోడైరెక్ట‌ర్‌, రైట‌ర్ల‌ను క‌లుస్తుంది. పాత్ర‌ల్ని క్రియేట్ చేయ‌మ‌ని కోరుతుంది. తెలుగు న‌టుల‌కు తెలుగువారే అవ‌కాశాలివ్వాల‌ని అభ్య‌ర్థిస్తుంది. మా మెంబ‌ర్ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున ఇళ్ల ప‌థ‌కాలు, ఇత‌ర‌త్రా ప‌థ‌కాలు అంద‌జేసేలా కృషి చేస్తున్నాం. ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు మాన‌సికంగా గైడ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇదో కొత్త ఎటెంప్ట్‌. ఏడాదిన్న‌ర‌లో మా చేస్తున్న అద్భుతాలెన్నో. భ‌విష్య‌త్ త‌రాల‌కు నేటి మా కార్య‌క‌లాపాలు ప‌దే ప‌దే గుర్తొచ్చేలా చేస్తాం... అన్నారు. 

'మా' ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీ రాజా మాట్లాడుతూ - 13ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన‌ప్పుడు ఇక న‌టించలేన‌ని అనుకున్నా. అప్పుడు మా స‌భ్యులే స‌పోర్టుగా నిలిచారు. అందుకే 'మా'కే అంకిత‌మై ఈ మంచి ప‌నులు చేస్తున్నా. మా స‌భ్యుల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా వ‌చ్చి నాతో చెప్పుకుంటారు. న‌రేష్, 'మా' ఈసీ మెంబ‌ర్లు నా వెంట ఉండ‌డంతోనే ఈ ప‌నుల‌న్నీ చేయ‌గ‌లుగుతున్నా. నా కెరీర్ ఆరంభం ఆటోలు, బ‌స్సుల్లో తిరిగాను. ఆ క‌ష్టం ఎలాంటిదో నాకు అనుభ‌వ‌మే. అందుకే మా స‌భ్యుల్లో 10 మందికి క‌నీసం బైకులు కూడా లేవ్‌. వారికి బైక్ లోన్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. బ్యాంకుల అండ‌దండ‌లున్నాయ్‌. 'మా' మెంబ‌ర్లు 350 మందికి ఉచిత యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాం. 2ల‌క్ష‌ల వ‌ర‌కూ ఎస్‌బిఐ క‌వ‌రేజీ ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కోసం అపోలో ఆస్ప‌త్రి వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపాం. వారి సాయం మాకు ఉంది. ఇలాంటి మేలు చేసే ప‌నులెన్నో మునుముందూ విజ‌య‌వంతంగా చేయ‌నున్నాం. ఆర్టిస్టుల‌కు అవకాశాల్ని ఇప్పించేందుకు జాబ్ విభాగం మొద‌లుపెట్టాం.. అని తెలిపారు. హైద‌రాబాద్‌లో ఫిలింఇనిస్టిట్యూట్ ఉంటే బావుంటుందని ప్ర‌భుత్వాన్ని కోరితే వెంట‌నే 100 ఎక‌రాల్లో ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు తెలంగాణ ప్ర‌భుత్వం హామీ ఇచ్చిందని ఈ సంద‌ర్భంగా శివాజీరాజా గుర్తు చేశారు. 

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ -సాటి మెంబ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే మంచి ప‌నులు చేయ‌డం 'మా' లోనే చూశాను. ఇంత‌కుముందు క‌డుపునిండినోళ్ల‌కు ఈ స‌మ‌స్య‌లేవీ తెలియ‌లేదు. కొత్త కార్య‌వ‌ర్గం, శివాజీరాజా ఆధ్వ‌ర్యంలో ఇప్పుడు మంచిప‌నులెన్నో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాయి. ఈరోజుల్లో వేషాలు ఎవ‌రికిస్తున్నారో నిర్మాత‌ల‌కు తెలీనేతెలీవు. కానీ నిర్మాత‌కు త‌ప్ప‌క తెలియాలి. మా - జాబ్ విభాగం బ్రోచ‌ర్‌లోని మెంబ‌ర్ల‌కు అంద‌రూ త‌ప్ప‌క అవ‌కాశాలివ్వాలి. నా వంతుగా వారికి అవ‌కాశాలిస్తాను. వేరొక‌రిని ఇవ్వ‌మ‌ని నేను కూడా అడుగుతాను.. అన్నారు. 

జ‌య‌సుధ మాట్లాడుతూ - న‌రేష్‌, శివాజీరాజా ఏ ప‌ని అనుకున్నా పూర్తి చేయ‌నిదే వ‌దిలిపెట్ట‌రు. శివాజీ 'మా' ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా ఎంతో ప్యాష‌న్‌తో ప‌నిచేస్తున్నారు. త‌న‌లా ఆలోచించేవాళ్లంతా క‌లిసి మంచి ప‌నులెన్నో చేస్తున్నారు. నిర్మాత‌, డైరెక్ట‌ర్‌, కోడైరెక్ట‌ర్ వ‌ద్ద ఈ బ్రోచ‌ర్ ఉండాలి. ఆర్టిస్టుల గౌర‌వం త‌గ్గ‌కుండా అవ‌కాశాలివ్వాలి. వేరే భాష‌ల న‌టులు మ‌న సినిమాల్లో న‌టించ‌డం త‌ప్పేం కాదు. అయితే తెలుగు న‌టీన‌టుల‌కు ఛాన్సులిచ్చి బ‌త‌క‌నివ్వాలి.. అన్నారు.⁠⁠⁠⁠

2. 'బంతిపూల జానకి' బావుందంటున్నారు!! -చిత్ర దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ 

చిన్న సినిమాలు రెండు మూడు రోజులాడడమే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది 'బంతిపూల జానకి'. ఈ చిత్రం సాధిస్తున్న విజయం ఇస్తున్న ఉత్సాహంతో..  సినిమా ప్రారంభంలో టైటిల్స్ వస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయిన 'బంతిపూల జానకి' టైటిల్ సాంగ్ ను.. హీరోయిన్ దీక్షాపంత్, ధన్ రాజ్, అదుర్స్ రఘు, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ తదితరులపై ప్రత్యేకంగా చిత్రీకరించి ఈ చిత్రానికి జోడించారు. అంతే కాదు, ఈ పాటతోపాటు కొన్ని హాస్య సన్నివేశాల్ని కూడా జత చేశామని చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ చెబుతున్నారు. 

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ కి కల్యాణి-రామ్-తేజ్ నిర్మాతలు. 

ఈ చిత్రం విజయం సాధిస్తుండడాన్ని పురస్కరించుకొని చిత్ర దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ..దర్శకుడిగా 'బంతిపూల జానకి' నాకు రెండో చిత్రం.  హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రం రెండో వారంలోనూ ఉభయ రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం చాలా సంతోషాన్నిస్తోంది. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నాకు ఇంత మంచి అవకాశం ఇఛ్చిన మా నిర్మాతలు కళ్యాణి-రామ్-తేజ్ లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దర్శకత్వం వహించే మూడో చిత్రం వివరాలు త్వరలోనే తెలియజేస్తాను... అన్నారు !! 

3. 'ప్రేమమ్' తరువాత చందు మొండేటి దర్శకత్వంలో 'ఐడ్రీమ్ మీడియా' చిత్రం

దక్షిణాదిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కంపెనీ 'ఐ డ్రీమ్ మీడియా' త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తమ తొలిప్రయత్నంగా వర్ధమాన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, శ్రుతి హాసన్ జంటగా చందు మొండేటి మళయాళ రీమేక్ గా 'ప్రేమమ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'ఐ డ్రీమ్ మీడియా' సంస్థ నిర్మించే చిత్రానికి చందు దర్శకత్వం వహించనున్నారు. నిఖిల్ హీరోగా  'కార్తికేయ' చిత్రాన్ని రూపొందించి, తొలి ప్రయత్నంలోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించిన చందు మొండేటి ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన రెండో చిత్రం 'ప్రేమమ్'తోనూ చందు మొండేటి తనదైన శైలి ని  పలికిస్తారని తెలుగు చలనచిత్రసీమ లోని పలువురి అభిప్రాయం. ఈ చిత్రం దసరా కానుకగా 2016 అక్టోబర్ లో జనం ముందు నిలువనుంది. 

'ఐ డ్రీమ్ మీడియా' సంస్థ చిత్రానికి దర్శకత్వం వహించబోవడం ఆనందంగా ఉందని చందు మొండేటి పేర్కొన్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్ళతో తనకు ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని చందు అన్నారు. సృజనాత్మకత రంగం ముఖచిత్రం త్వరితగతిని పరిణామం చెందుతోంది. మూవీ మార్కెట్ లో ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.  'ప్రస్తుతం ఓవర్సీస్ తెలుగు సినిమాకు మరో ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేయడంలో ఐ డ్రీమ్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్ సంస్థ కూడా నాలాగే సృజనాత్మకతవైపు అడుగులు వేస్తోంది. అలాగే ఈ సంస్థకు పదనైన ఆలోచనలు చేసే యంగ్ టీమ్ ఉండడం మరో ఎస్సెట్. ఈ సంవత్సరం ఆఖరులోగా ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుంది. నటీనటవర్గం, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము' అని చందు తెలిపారు. 

యూ ట్యూబ్ లో ఐ డ్రీమ్ హవా విశేషంగా వీస్తోంది. దాదాపు 1.5 బిలియన్ (150 కోట్లు) వ్యూస్, మిలియన్ (పది లక్షలు) సబ్ స్క్రైబర్స్, 150 ఛానెల్స్, దాదాపు 15,000 గంటల డిజిటల్ కంటెంట్ (వీటిలో దాదాపు 2000 చలనచిత్రాలు), ఓటీటీ స్పేస్ లో విశేషాదరణ పొందుతూ ఐడ్రీమ్ మీడియా ప్రస్తుతం అందరు నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్, న్యూజెర్సీ కేంద్రాలుగా ఈ సంస్థ నిర్వహణ సాగుతోంది. తెలుగు, తమిళ చలన చిత్రాలు, వాటితో పాటు పలు లఘుచిత్రాలు, 'టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్' పేరున సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, 'ఇండియన్ పొలిటికల్ లీగ్' (ఐపీఎల్), ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ వంటివి ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ చూరగొన్నాయి. 

'చందు దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రాన్ని మేము నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని ఐ డ్రీమ్ వ్యవస్థాపకులు, సీఈవో వాసుదేవరెడ్డి చిన్నా తెలిపారు. చందు ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని, అతని నిర్దేశకత్వంలో ఓ మంచి చిత్రం తప్పకుండా జనానికి అందిస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటామన్న నమ్మకం మాకుందని ఆయన అన్నారు. చిత్ర కథానాయకుడు ఎవరన్నదానితోపాటు మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలతో మీ ముందుకు త్వరలో వస్తామని , మీడియా మిత్రులందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ