ఎన్టీఆర్ , సమంత, నిత్యా మీనన్ హీరో, హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, సి వి మోహన్ లు నిర్మిస్తున్న 'జనతా గ్యారేజ్'పాటలు హైద్రాబాద్ లో విడుదలయ్యాయి. దేవి శ్రీ సంగీతం అందించిన ఈ ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ సిడి ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, దిల్ రాజు, వక్కంతం వంశీ, కొరటాల శివ, ఎన్టీఆర్ , రాజీవి కనకాల , దేవి శ్రీ ప్రసాద్, బి వి ఎస్ ఎం ప్రసాద్ , నిత్యా మీనన్ తో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ .. నటనలో ఎలాంటి ఛాయిస్ వదలని నటుడు ఎన్టీఆర్. తనతో సినిమా చేసిన తరువాత మా మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది, ఇక దేవి గురించి ఎంత చెప్పిన తక్కువే. కొరటాల శివ కమర్షియల్ సినిమాకు అప్ డేట్ వెర్షన్. మైత్రి మూవీస్ నిర్మాతలకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి అన్నారు.
మరో నిర్మాత భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ లుక్ చాలా బాగుంది. గ్యారంటీ గా మంచి చిత్రమవుతుంది. యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. షూటింగ్ సమయంలోనే ఈ పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. అప్పట్లో సింహాద్రి ఎలాంటి వేవ్ ఇచ్చిందో ఈ సినిమా కూడా అలాంటి వేవ్ తో రాబోతుంది. ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ తన కెరీర్ లో నంబర్ వన్ సినిమా అవుతుంది. ఈ సినిమాతో కొరటాల శివ హ్యాట్రిక్ కొడతాడు, అలాగే నిర్మాతలు శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు .. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్నారు.
హీరోయిన్ నిత్యా మీనన్ మాట్లాడుతూ .. నేను వేరే సినిమాలు చేస్తే టప్పుడు ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేస్తావని అందరు అడిగేవారు, ఈ సినిమాతో ఆ ఛాన్స్ దక్కింది. మంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేయాలనీ ఎప్పటినుండో ఉండేది, ఆ కోరికను శివ గారు తీర్చారు అన్నారు.
చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ .. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. రైటర్ గా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం సినిమా రాసాను. పెద్దగా మాట్లాడేవాడిని కాను, ఇదే వేదికపై ఎన్టీఆర్ నన్ను పరిచయం చేసారు. అక్కడనుండి నా జర్నీ మొదలైంది. అందుకే ఎన్టీఆర్ అంటే నాకు స్పెషల్. అయన ఎనర్జీ కి మ్యాచ్ అయ్యేలా రాయాలని ఎప్పుడు అనుకుంటూ .. ఈ సినిమా చేసాను. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నాను. చిన్నప్పుడు మోహన్ లాల్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలాంటి వ్యక్తికి యాక్షన్ చెప్పాను. తాను చాల బెస్ట్ యాక్టర్. ఎన్టీఆర్ , మోహన్ లాల్ ను ఓకే ప్రేమ్ లో పెట్టి యాక్షన్ చెప్పాను, అది చాలు నాకు. చాలా సుడి ఉంది. సమంత , నిత్యా మీనన్ లతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బెస్ట్ టీమ్ పనిచేసారు. దేవి సంగీతం ఎప్పటిలాగే అదరగొడుతుంది. మంచి నటీనటులు, టెక్నీషియన్స్ తో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. ఈ సినిమాకు నిర్మాతల సహకారం మరవలేనిది. వచ్చే నెల 2 న బ్లాక్ బస్టర్ హిట్ తో మీ ముందుకు వస్తున్నాం అన్నారు.
హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో కానీ ఆ మహానుభావుడికి మనవడిగా, అద్భుతమైన తల్లిదండ్రులకు కొడుకుగా, మీలాంటి వారికి అన్నగా , తమ్ముడిగా పుట్టే అవకాశం కలిగింది. ఈ ఋణం తీరిపోదని నేను అనుకుంటున్నాను. పన్నెండేళ్లకు వచ్చే పుష్కర కాలం వస్తుంది. 'నిన్ను చూడాలని' సినిమా సమయంలో ఎక్కడికి వెళుతున్నానో .. ఏమవుతున్నానో తెలిసేది కాదు. ఆ తర్వాత ఆది, ఆ తరువాత సింహాద్రి సినిమా దక్కింది. అంత బాగానే ఉంది కదా అని అనిపించింది. కానీ మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలెం .. చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేస్తుంటాడు. అప్పుడే నీకు జీవితం అంటే తెలుస్తుందని. చాలా కాలం బాధ పడ్డాను, నా అభిమానులు ఎంత బాదపడ్డారో నాకు తెలుసు. నాలో నేనే కుమిలిపోయాను. కానీ ఓ రోజు వక్కంతం వంశీ 'టెంపర్' కథ చెప్పాడు, దూరంగా ఓ వెలుగు కనిపించింది. పూరి జగన్నాధ్ అనే దర్శకుడు స్వతహాగా మంచి రచయితా అయినా ఎదో చేద్దామని నాకంటే ముందుగానే పరుగెత్తాడు. అందరం ముందుకెళ్ళం గమ్యానికి దగ్గరయ్యాం. తరువాత 'నాన్నకు ప్రేమతో'మంచి సినిమా వచ్చింది. నా లుక్ చేసి ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం కలిగింది, కానీ బాగా రీసీవ్ చేసుకున్నారు. మీ అభిమానం, ఆశీర్వాదంతో ఆ లైట్ ఇంకా దగ్గరైంది, అప్పుడే తెలిసింది ఆ లైట్ ఎదో కాదు 'జనతా గ్యారేజ్' అని. రెండు సంవత్సరాల క్రితం శివ చెప్పిన కథ ఇది. నాకున్న ఫ్లాప్ సినిమాలతో బిజీగా ఉండి కథ విని చేయలేదు. రచయితకు కలం ఆగిపోకూడదు. తన రచనలో ఎంత తక్కువగా చెప్పే ప్రయత్నం చేయాలో తనతో ఉన్న దర్శకుడికి తెలిసుండాలి. అది ఉన్న అతి కొద్దిమంది దర్శకులలో శివ ఒక్కరు. మోహన్ లాల్ లాంటి గొప్ప నటుడితో పనిచేసే అవకాశం రావడం అదృష్టాంగా భావిస్తున్నాను. ఇక దేవి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమాకు మంచి సినిమాటోగ్రఫీ ఇచ్చారు తీరు గారు. నాకు పిసి శ్రీ రామ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం .. ఆ తరువాత నాకు బాగా నచ్సినా వ్యక్తి తీరు. అలాగే ఈ సినిమా నిర్మాతలు కూడా చాలా మంచి వ్యక్తులు, ఎందరో నిర్మాతలు ఉంటారు కానీ మంచి మనుషులు మాత్రం అరుదుగా ఉంటారు. ఇక 'నాన్నకు ప్రేమతో' సినిమా సమయంలో నా పోస్టర్ కు పాలాభిషేకాలు చేశారు. దయచేసి ఇక ముందు అలా చేయకండి .. ఆ పాలను ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి. అలాగే ఓ మేకను అదే సినిమా సమయంలో బలి ఇచ్చారు .. సినిమాలు ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికే కానీ బలి ఇవ్వడానికి కాదు, దయచేసి ఇలాంటి ముగా జీవాలను భలి చేయకండి .. దానికంటే ఆ థియేటర్స్ లో అన్నదానం చేయండి. పదిమంది ఆకలి తీర్చండి ... ఇది నా కోరిక. అలాగే అందరు జాగ్రత్తగా ఇంటికి చేరుకొండి అని అన్నారు.