ఎక్స్‌వైజడ్ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వసూళ్లను సాధిస్తోంది అని తెలిపారు ఎస్.కె. బషీద్. ఆయన స్వీయ దర్శకత్వంలో నూతన తారాగణంతో రూపొందిన చిత్రం ఎక్స్‌వైజడ్. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బషీద్ మాట్లాడుతూ అల్లరే అల్లరి చిత్రంతో నా సినీ జీవితం మొదలైంది. ఆ తర్వాత రామ్‌దేవ్‌తో పాటు ఓ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించాను. ఓ తమిళ సినిమా ఆధారంగా ఎక్స్‌వైజడ్‌ను తెరకెక్కించాను. యదార్థ సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. తొలి రోజున 47 లక్షల షేర్‌ను సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. త్వరలో తొమ్మిది థియేటర్లను పెంచుతున్నాం. మా బ్యానర్ తెలుగు, తమిళ భాషల్లో మరో మూడు సినిమాల్ని రూపొందిస్తున్నాం. థియేటర్ల కేటాయింపు విషయంలో చిన్న సినిమాల పట్ల వివక్ష కొనసాగుతుంది. అగ్రహీరోల చిత్రాలకే మాత్రమే థియేటర్లను కేటాయిస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.. ముందస్తుగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినా మా సినిమాకు థియేటర్లు కేటాయించడానికి ముందుకు రావడం లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పాటు చిత్ర పరిశ్రమలో చాలా సంఘాలు ఉన్నా చిన్న నిర్మాతలకు న్యాయం జరగడం లేదు. కథాబలమున్న చిన్న సినిమాలకు సరైన గుర్తింపు దక్కడం లేదు. సినిమా పట్ల ఉన్న ఇష్టంతో సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే నిర్మాతలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. థియేటర్ల కేటాయింపు విషయంలో చిత్ర పరిశ్రమ దృక్పథంలో మార్పులు రావాలి. చిన్న సినిమాలను ఆదరించాలి అని తెలిపారు.