నా సినిమాలకు ఆడియో ఫంక్షన్స్ చేయడం నచ్చదు..
ఆడియో ఫంక్షన్ అంటే బోరింగ్ బోరింగ్ బోరింగ్..
ఆడియో ఫంక్షన్ అంటే ఒకరి గురించి ఒకరు డబ్బా కొట్టుకోవడమే..
వేదిక మీదకొచ్చిన అతిథుల్ని ఓ సాంగ్ లాంచ్ చేయండి అంటే..
ఏం జరుగుతుందో తెలియనట్లు అర్ధం కానట్లు తెల్ల మోహమేసి చూస్తారు..
ఇదంతా వృదా ప్రయాస. ఈ విధానం మారే వరకు నా సినిమాలకు ఆడియో వేడుకను నిర్వహించను
ఇవన్నీ ఎవరి మాటలనుకుంటున్నారా...
ఏదైనా కొత్తగా ఆలోచిస్తూ, చడీచప్పుడు లేకుండా సినిమాలు తీసే నటుడు, దర్శకుడు రవిబాబు మాటలు.
ఎస్ ఇది.. నిజం.
ఇటీవల ఆయన ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడియో ఫంక్షన్ల గురించి తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించారు. ఆయన మాట్లాడింది నూటికి నూరుశాతం వాస్తవం. ఆడియో వేడుక అనేది సినిమా ప్రమోషన్‌కి నాందిగా సినిమా పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం మన సినీ ప్రముఖులు నిర్వహిస్తున్న ఆడియో వేడుకలు ప్రేక్షకుల పాలిట ఆరాచక కార్యక్రమాలుగా మారాయని రవిబాబు వాపోయారు. ఇటీవల ఆయన వెళ్లిన ఓ ఆడియో వేడుకలో కూర్చోవడమే చాలా ఇబ్బందిగా అనిపించిందని, అతిథుల్ని పిలిచినప్పుడు దిక్కులు చూడడం ఆయన వంతు అయిందని ఆయన అన్నారు.
యాంకర్ వస్తుంది ఏదో మాట్లాడుతుంది. ఓ ఏవీ అంటుంది..వెళ్తుంది. ముక్కు మోహం తెలియని వాడికి కూడా ఏవీలు తయారు చేసి జనాల సహనానికి పరీక్ష పెడుతున్నారు. లేదంటే పాటలు ప్లే చేస్తారు. ఆ పాట వెనుక ప్లే అవుతుంటుంది. స్టేజ్ మీద మాత్రం సింగర్స్ పాడుతున్నట్లు యాక్ట్ చేయడం ఇదంతా ఓ నాన్సెన్‌లా అనిపిస్తుంది. అతిథుల్ని పిలవడం వారిని పొగడ్తలతో ముంచేయడం చాలా విసుగ్గా ఉంటుందని అన్నారు.
వాళ్లను పొగిడే సమయంలో ఆయా సినిమాకు సంబంధించి నాలుగు మాటలు, సినిమాలో ఉన్న హైలైట్స్ గురించి ఆ వేదిక మీద మాట్లాడితే.. టీవీల్లో చూసేవారికి ఆ సినిమాలో ఏముందో అర్ధమవుతుంది. అంతే కానీ పిలిచిన అతిథుల గురించి డబ్బా కొడితే సినిమాలో ఉన్న విషయం జనాలకు ఏం తెలుస్తుంది. కేవలం టెలివిజన్ లైవ్ ప్రొగ్రామ్స్ వల్ల ఇంత టైమ్ సెల్ఫ్ డబ్బా కొడుకున్నారేమో అనిపిస్తుంది.
కొత్త పద్దతిలో ఆడియో ఫంక్షన్లు కనిపెడితే అప్పుడు నా సినిమా పాటల్ని జనాల మధ్యలో విడుదల చేస్తా అని రవిబాబు అన్నారు.