ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొనసాగుతున్న డిజిటల్ ప్రింట్ టెక్నాలజీకి ధీటుగా ఎఎంఎఫ్ ఎస్‌పిడిటి వారు అందిస్తున్న సరికొత్త విధానం సినీ పరిశ్రమకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని పలువురు సినీ ప్రముఖుల వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎఎంఎఫ్ అధినేత నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్ పిడిటి వారి సాంకేతిక సహకారంలో మా సంస్థ భాగస్వామ్యమై నిర్మాతలకు ,డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మేలు చేకూరే నిర్ణయాలను తీసుకుంది. కొన్ని వేరే సంస్థలు డిజిటల్ ప్రింట్ డెలివరీని ఫస్ట్ వారానికి దాదాపు 12 వేల రూపాయలు రెండవ వారానికి 8 వేల రూపాయలను వసూలు చేస్తుంటే మేము మాత్రం ఫస్ట్ వారానికి కేవలం మూడు వేల రూపాయలను , రెండవ వారానికి 12 వందల రూపాయలను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించాం. వంద థియేటర్లలో సినిమాను విడుదల చేయాలంటే వేరే సంస్థల వల్ల 12 లక్షలు ఖర్చుఅవుతుంది. మా సంస్థ విధానం వల్ల కేవలం మూడు లక్షలు మాత్రమే ఖర్చుఅవుతుంది. సినీరంగంలోని వారికి ఇదో అద్బుత అవకాశం. అలాగే మినీ థియేటర్ల ఇంటీరియర్‌లో భాగంగా సౌండ్, ప్రొజెక్టర్ ,సీటింగ్ ఎ సి వంటి అన్ని రకాల సౌకర్యాల కోసం మా సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఈ విధానాన్ని పరిశ్రమకు చెందిన వారు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పిడిటికి చెందిన కుమార్ ఆదర్శ్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రాంమోహనరావు, చదలవాడ శ్రీనివాసరావు, అమ్రిష్ కుమార్, ఏసియన్ ఫిల్మ్స్ సునీల్, మల్టీడైమన్షన్ వాసు, విజయేందర్‌రెడ్డి, టి ప్రసన్నకుమార్, అల్లాడి శ్రీధర్, తమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగిశెట్టి దశరథ, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.