బిపిన్, శ్రీహర్ష, లయన్ ప్రధాన పాత్రల్లో షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై బిపిన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'బంగారు తెలంగాణా'. ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా..
దర్శకనిర్మాత బిపిన్ మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా సాధించే క్రమం నుండి గ్రేటర్ ఎన్నికల జరిగే వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కేసీఆర్ చేసే మంచి పనులే బంగారు తెలంగాణా. ఏ ప్రాంతానికి ఈ సినిమా వ్యతిరేకం కాదు. మా హక్కులను, తెలంగాణాను సంపాదించుకున్నాం. అదే నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేయనున్నాం. మొదటగా 10 జిలాల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం. ఈ సినిమాకు ప్రభుత్వం రాయితీ కలిపిస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''బిపిన్ ఈ సినిమాకు అన్ని తానై చేసుకున్నాడు. సినిమాపై ప్రేమ ఉన్న చాలా మంది సహా నిర్మాతలు తనకు దొరికారు. బంగారు తెలంగాణా దిశగా ప్రభుత్వం వెళుతోంది. ఆ నేపధ్యంలో వస్తోన్న ఈ సినిమా సక్సెస్ కావాలి. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు కోసం ప్రయత్నిస్తాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధు.ఏ.నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.ఎస్.ఆర్, కెమెరామెన్: ఆళ్ళ రాంబాబు, ఎడిటింగ్: నాగిరెడ్డి, కథ-మాటలు-పాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: బిపిన్.