అశోక్, దిశా పాండే జంటగా సెకండ్ ఇండిపెండన్స్ టాకీస్ బ్యానర్ పై సాయిరాం చల్లా దర్శకత్వంలో ప్రభాకర్ రెడ్డి నిర్మించిన సినిమా 'కంట్రోల్ సి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిరాం చల్లా విలేకర్లతో ముచ్చటించారు. ''మా సొంతూరు గుంటూరు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే నాకు సినిమాల మీద ఆసక్తి ఉండేది. అయితే అది సరైన సమయం కాదనుకున్నాను. అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ లో స్థిరపడ్డాను. 'ఆర్య' సినిమా నుండి నాకు సుకుమార్ గారితో పరిచయం ఉంది. కాని ఎప్పుడు ఆయనకు నాకు సినిమాల మీద ప్యాషన్ ఉందనే విషయాన్ని చెప్పలేదు. 1 నేనొక్కడినే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు సినిమా చేయాలనుందని సుకుమార్ గారికి చెప్పగానే ఆశ్చర్యపోయారు. నేను రాసుకున్న కథలు చెప్పమని అడిగారు. ఒక లైన్ చెప్పగానే ఇది పెద్ద బడ్జెట్ సినిమా.. ముందుగా చిన్న సినిమా చేసిన తరువాత పెద్ద సినిమా చేయమని చెప్పారు. ఆయన సజెషన్ తో కంట్రోల్ సి సినిమా మొదలుపెట్టాను. ఇదొక సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ మూవీ. 2001 లో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి అక్కడి నుండి బయటపడతారు. అక్కడ వారికొక టేప్ దొరుకుతుంది. ఆ టేప్ పట్టుకొని ఇండియా తిరిగొచ్చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో జాబులో జాయిన్ అవుతారు. అదొక హాంటెడ్ ప్లేస్. ఆ టేప్ కు, సాఫ్ట్ వేర్ కంపనీలో రాత్రి పూట జరిగే మిస్టరీస్ కు సంబంధం ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా నిడివి గంట నలభై ఆరు నిమిషాలు. చాలా క్రిస్పీ గా ఉంటుంది. సుకుమార్ గారు కొన్ని విజువల్స్ చూసి చాలా బావున్నాయని చెప్పారు. పదేళ్ళ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా చేశావని చెప్పారు. జూన్ 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.