ఆర్ట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారాడు చంటి అడ్డాల. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై ఎన్నో చిత్రాలను నిర్మించిన చంటి అడ్డాల త్వరలోనే ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ''ప్రొడ్యూసర్ గా కంటే ఆర్ట్ డైరెక్టర్ గానే నేను సంతోషంగా ఉండేవాడిని. ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కావు. కాని ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలను నిర్మించాలనే అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయమని అడుగుతున్నారు కాని నాకు ఆసక్తి తగ్గిపోయింది. డిసంబర్ నెల నుండి మా బ్యానర్ లో ఓ పెద్ద హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాతగా నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండేవారికి కాంబినేషన్స్ తప్ప కథతో పని లేకుండా పోయింది. ఈ మూడేళ్ళలో కథల మీద వర్క్ చేయించి సుమారుగా మూడు కోట్లు పోగొట్టుకున్నాను. రెండు యూనిట్స్ తో కథల మీద పని చేయించేవాడ్ని. తీరా ఆ కథను హీరోకు వినిపిస్తే పెద్ద డైరెక్టర్ ఉంటే కాని చేయనని అంటున్నారు. హీరోలు కాంబినేషన్స్ కు ఇచ్చే విలువ కథకు ఇవ్వట్లేదు. ఒక్కోసారి సినిమాలు చేయాడానికి బాధగా అనిపిస్తుంటుంది. కథను నమ్మి సినిమా చేయాలా..? లేక కాంబినేషన్ ను నమ్మి సినిమా చేయాలో..? అర్ధం కావట్లేదు. మరాఠి సినిమా 'సైరత్' ను రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వరుసగా చిన్న సినిమాలు చేయడం వలన వర్కవుట్ కావట్లేదు. అందుకే పెద్ద సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. పెద్ద సినిమా అంటే ఫైనాన్షియర్స్ సులభంగా దొరుకుతారు. కాని చిన్న సినిమా అంటే ఎవరు సాహసించట్లేదు'' అని చెప్పారు.