మహేష్‌బాబు ఏ టైమ్‌లో ఆ స్టెప్పేశాడో కానీ... బ్రహ్మోత్సవంలో ప్యాంటు విదిలించుకొనే స్టెప్పులు జనాలకి కామెడీ టాపిక్ అయిపోయింది. థియేటర్లో ఆ స్టెప్పుల్ని వీడియో తీసి మరీ పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజన్లు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి వర్మ కూడా చేరాడు. ఇలాంటి స్టెప్పుల్ని చూసి వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్లు కూడా నేర్చుకోవల్సి వుందని కామెంట్ చేశాడు వర్మ. ఇక మహేష్‌పై వరుసగా ఇలాంటి సెట్టైర్లే పేలుతాయని, పవన్ కళ్యాణ్‌ని విమర్శించినట్టే మహేష్‌ని కూడా వర్మ వదిలిపెట్టడని అనుకొన్నారంతా. అయితే ఆయన సెట్టైర్లు, విమర్శలు అక్కడితో ఆపేసి నీతులు చెప్పడం మొదలుపెట్టారు.
ఫ్యామిలీ సబ్జెక్టులు తీస్తే శోభన్‌బాబులు అంటారు తప్ప కృష్ణ, ఎన్టీఆర్‌లు అనరు కాబట్టి.... మహేష్ ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన పోకిరి, బిజినెస్ మేన్ తరహా సినిమాలే చేయాలని సూచనలిచ్చాడు వర్మ. దేవత సినిమాని చూసినప్పుడు ఆ కథే గుర్తుంటుంది తప్ప శోభన్‌బాబు గుర్తుండడనీ, ఏజెంట్ గోపీ, అడవిరాముడు సినిమాల్ని చూస్తే కృష్ణ, ఎన్టీఆర్‌లు గుర్తుకొస్తారు తప్ప కథ కాదని... అలా మహేష్ కూడా తాను గుర్తుండేలా కథల్ని ఎంచుకోవాలన్నట్టుగా కామెంట్ చేశాడు వర్మ. స్వతహాగా వర్మకి కుటుంబ కథలంటే ఇష్టముండదు కాబట్టి ఆ సూచన చేశాడు. కానీ కుటుంబ కథల్ని అమితంగా ఇష్టపడే మహేష్ ఆయన సలహా ఎలా స్వీకరిస్తారో చూడాలి. పనిలో పనిగా మహేష్ అభిమానుల్ని ఆకాశానికెత్తేశాడాయన. నా కామెంట్లని మహేష్ అభిమానులు పాజిటివ్‌గా తీసుకోవడం హ్యాపీగా ఉందని ట్వీటాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకి చురకెత్తినట్టైంది. మొత్తంగా వర్మ ఏం చేసినా ఏదో ఒక అలజడిని మాత్రం క్రియేట్ చేస్తుంటాడు. వర్మ ట్వీట్ల వెనక ఉద్దేశం కూడా అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.