త్రివిక్రమ్‌తో సన్నాఫ్ సత్యమూర్తి చేయడం కోసం ఆమధ్య ఏడెనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్నాడు బన్నీ. మధ్యలో గుణశేఖర్ వచ్చి రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర అప్పజెప్పాడు కాబట్టి బన్నీ కొన్ని రోజులు బిజీగా గడిపేందుకు ఆస్కారం లభించింది. నెల రోజులపాటు కాల్షీట్లు కేటాయించి ఆ సినిమాని పూర్తి చేశాడు. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ ఈసారి మాత్రం బన్నీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరేడు నెలలు గ్యాప్ తప్పేలా లేదు.
బన్నీ విక్రమ్ కె.కుమార్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకోసం విక్రమ్ ఇంకా పూర్తిస్థాయిలో స్క్రిప్టుని సిద్ధం చేయలేదు. దానికి ఓ ఆర్నెళ్ల సమయమైనా కావాలంటున్నాడట. ఈ యేడాది చివర్లో సినిమాని మొదలుపెడదామని చెప్పాడట. మొన్నటివరకు 24 పనుల్లో బిజీగా వున్న విక్రమ్‌కి కొత్త స్క్రిప్టు రాసుకోవడానికి ఆమాత్రం సమయమైనా కావాలి మరీ! కానీ బన్నీకి మాత్రం ఆరేడు నెలలు ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదట. అందుకే మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించాలని అనుకున్నాడు. బన్నీతో సినిమా చేయాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. ఆయనకి అవకాశమివ్వడానికి బన్నీ రెడిగానే వున్నా లింగుస్వామి కథ కూడా ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని తెలిసింది. దీంతో ఎలాగైనా గ్యాప్ తప్పేలా లేదని అర్థమవడంతో బన్నీ ఈ ఆర్నెళ్ల సమయాన్ని తన కుటుంబానికి కేటాయించాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది.