తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ఏఎన్నార్. చివరి శ్వాస వరకు సినిమాతోనే మమేకమైన ఆయన్ని భావితరాలు సైతం గుర్తు పెట్టుకొంటాయి. అలాంటి గొప్ప నటుడి పుట్టినరోజు ఎవరు మాత్రం మరిచిపోతారు చెప్పండి? ఏఎన్నార్ పుట్టినరోజు సెప్టెంబరు 20 అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఆయన ముద్దుల మనవడు సుమంత్ మాత్రం తాతగారి పుట్టినరోజు నేడే అని ట్వీట్ చేశాడు. అదెలా అంటారా? సుమంత్ అలా ట్వీట్ చేయడానికి ఓ కారణం వుందిలెండి. ఏఎన్నార్ నటించిన తొలి చిత్రం శ్రీసీతారామజననం విడుదలైంది ఈ రోజేనట. అంటే 72యేళ్ల కిందట మెయిన్ లీడ్ యాక్టర్‌గా ఏఎన్నార్ నటించింది శ్రీసీతారామజననం సినిమాలోనే. నటుడిగా జీవితాన్నిచ్చిన సినిమా విడుదలైంది ఆ రోజే కాబట్టి అప్పట్నుంచి ఏఎన్నార్ నా పుట్టినరోజు మే 8నే అని కుటుంబ సభ్యులకీ, సన్నిహితులకీ చెప్పేవాడట. అందుకే ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని సుమంత్ అలా ట్వీట్ చేశాడు. శ్రీసీతారామజననంలోని ఏఎన్నార్ గెటప్‌తో కూడిన స్టిల్‌ని కూడా ఆ పోస్ట్‌లో పెట్టాడు సుమంత్.