జీవిత చరిత్ర నేపథ్యంలో సినిమా అంటే దాని వెనకాల చాలా తతంగమే ఉంటుంది. దర్శకులు బోలెడంత రీసెర్చ్ చేయాలి. ప్రధాన పాత్ర పోషించే నటులు నిజ జీవితాల్ని పరిశీలించి అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలి. ట్రైనింగ్‌లు, స్పెషల్ గెటప్పులు... ఇలా బోలెడన్ని వ్యవహారాలుంటాయి. ప్రతి విషయంలోనూ పక్కాగా వుంటే తప్ప ఆ సినిమాలు అనుకున్నట్టుగా తెరకెక్కవు. అందుకే చాలామంది నటులు అంతటి కష్టం మనం పడలేమేమో అని ఆ తరహా చిత్రాలకి దూరంగా వుంటుంటారు. హిందీలో కూడా కొద్దిమంది నటులు మాత్రమో బయోగ్రఫీ చిత్రాల్లో నటిస్తుంటారు. అయితే తాజాగా మన తెలుగు కథానాయకుడు సుధీర్‌బాబు జీవిత చరిత్ర నేపథ్యంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ జీవితం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమది. పుల్లెల గోపీచంద్‌గా సుధీర్‌బాబు నటించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తాడన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విషయంలో కథానాయకుడు సుధీర్ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. పుల్లెల గోపీచంద్ పాత్రని ఊదేస్తా అని చెబుతున్నాడు. ఆటో బయోగ్రఫీతో తెరకెక్కుతున్న కీలకమైన సినిమా విషయంలో సుధీర్ అంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి ఓ బలమైన కారణమే వుంది. పుల్లెల గోపీచంద్ జీవితాన్ని సుధీర్ దగ్గర్నుంచి చూశాడు. సుధీర్ కూడా స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్. దానికితోడు ఇద్దరూ కలిసి ఆడారు కూడా. పుల్లెల లైఫ్ స్టైల్, హావభావాలు, నడవడిక.. ఇలా అన్నీ తెలిసిన వ్యక్తి సుధీర్. ఆయన పాత్రని ఎలా చేయాలో ఇప్పటికే ఓ పక్కా అవగాహనతో వున్నాడు. ``పుల్లెల గోపీచంద్ చిత్రం కోసం నేను అసలేమాత్రం సన్నద్ధం కావల్సిన అవసరం లేదు. జస్ట్ పెరిగిన బరువును కాస్త తగ్గించుకొంటే చాలు. మిగతా విషయాలన్నింట్లోనూ ఇప్పటికే ఓ పక్కా ప్రణాళికతో వున్నా`` అని చెప్పుకొచ్చాడు సుధీర్. నిజంగా ఆ పాత్రకి సుధీర్ న్యాయం చేసేంతగా మరెవ్వరూ చేయలేరేమో! మిగతా కథానాయకులయ్యుంటే బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకోవడం దగ్గర్నుంచి అన్నీ నేర్చుకోవల్సి వచ్చేది. కానీ సుధీర్ రూపంలో రెడిమేడ్ గోపీచంద్ దొరికేశాడు. పుల్లెల గోపీచంద్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు వుంది కాబట్టి ఆ సినిమాని తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.