విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ అంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి 'బిచ్చగాడు' టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. విజయ్ అంటోని సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని శుక్రవారం ఫిల్మ్ చాంబర్‌లో విడుదల చేశారు. జయసుధ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని విజయ్ ఆంటోనికు అందించారు. ఈ సందర్భంగా..
జయసుధ మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూశాక మంచి సందేశమున్న సినిమాలాగా అనిపించింది. తమిళంలో ఈ సినిమా నేను చూడలేదు గానీ మా అబ్బాయి మంచి సినిమా అని చెప్పాడు. ఇందులో తల్లి సెంటిమెంట్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి సినిమాలు తీసే ప్రయత్నం తెలుగులో పెద్దగా చెయ్యరు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో తప్పకుండా హిట్ అవుతుంది'' అని చెప్పారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ... ''పిల్లల కోసం తల్లి ఎన్నో చేస్తుంది. తల్లి కోసం బిడ్డలు ఏం చేస్తున్నారన్నది ఈ సినిమా కథ. తల్లిని కాపాడుకునేందుకు ఓ అబ్బాయి ఏం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. చక్కని సందేశమున్న చిత్రమిది. కుటుంబం మొత్తం చూసే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా నచ్చే సినిమా ఇది'' అని అన్నారు.
దర్శకుడు శశి మాట్లాడుతూ... ''వెంకటేష్‌తో శ్రీను సినిమా తీసిన 17 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నా సినిమా విడుదల అవుతుంది. చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''బిచ్చగాడు చాలా మంచి సినిమా. నేను ఏ సినిమా చూసి ఏడవలేదు. కాని ఈ సినిమాలో కొన్ని సీన్స్ నా కళ్ళు చమర్చేలా చేశాయి. రజనీకాంత్, కమల్‌హాసన్‌ను కలిపితే ఎటువంటి నటన వస్తుందో ఆ తరహాలో విజయ్ ఆంటోని నటించాడు. ఈ సినిమాపై వచ్చిన మొత్తాన్ని మినీ థియేటర్స్ కోసం నా వంతు సాయంగా అందిస్తాను'' అని అన్నారు.