ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నడిచిన దారిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నాడా? అంటే కొందరు అవుననే అంటున్నారు. వాస్తవానికి టిడిపికి చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థానాన్ని అధిష్టించాలని జూనియర్‌తో పాటు ఆయన తండ్రి హరికృష్ణ కూడా భావించాడు. కానీ భవిష్యత్తులో ఎన్టీఆర్ వల్ల నారా లోకేష్‌కు ఇబ్బందులు వస్తాయని ముందే ఊహించిన చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టాడు. తాజాగా తెలంగాణలో కూడా హరీష్‌రావు వల్ల తన కుమారుడైన కేటీఆర్‌కు ముప్పు ఉందని భావిస్తున్న కేసీఆర్ హరీష్‌రావుకు ఉన్న ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్వయంగా హరీష్‌రావు తనకు మైనింగ్ శాఖ బాధ్యతలు వద్దని, తాను ఆ శాఖకు న్యాయం చేయలేనని చెప్పాడన్న సాకుతో ఆయనకు ఉన్న శాఖలను తగ్గించిన కేసీఆర్, అదే సమయంలో తన కుమారుడైన కేటీఆర్ చేతికి మాత్రం కీలకశాఖలను ఇచ్చాడు. మరి ఇన్ని శాఖలు చూస్తున్న కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్ వంటివారికి లేని పని ఒత్తిడి కేవలం హరీష్‌రావుకే ఉందని చెబితే ఎలా నమ్మాలి? అని కొందరు వాదిస్తున్నారు. వాస్తవానికి హరీష్‌రావు కేటీఆర్ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటికీ తన నియోజకవర్గంలో హరీష్‌కు తిరుగలేదు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ కంటే హరీష్‌రావుకే మంచి పట్టు ఉంది. కానీ ఆయన రాజకీయ ప్రస్తానానికి పుల్‌స్టాప్ పెట్టడం కోసమే హరీష్‌రావు చేత పని ఒత్తిడి అనే మాట బలవంతంగా చెప్పించారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రవిభజన సమయంలో చంద్రబాబు చెప్పిన రెండు కళ్ల సిద్దాంతాన్ని ఇప్పుడు కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా వల్లెవేస్తున్నారు. కేసీఆర్‌కు కేటీఆర్, హరీష్‌రావులు రెండు కళ్లవంటి వారు అని ఆమె మీడియాకు చెప్పింది. మరి ఆనాడు బాబు చెప్పిన రెండు కళ్ల సిద్దాంతాన్ని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అదే సూత్రాన్ని వల్లెవేస్తుండటం గమనార్హం. ఏదీఏమైనా టీడీపీలో నారా లోకేష కోసం ఎన్టీఆర్ చెక్ పెట్టిన తరహాలోనే కేసీఆర్ కూడా హరీష్‌రావును వాడుకొని వదిలేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత బాల్‌థాకరే నడిచిన బాటలోనే కేసీఆర్ కూడా నడుస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.