సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం 'సుప్రీమ్'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. అంజనాదేవి బిగ్ సీడీని విడుదల చేయగా.. అల్లు అరవింద్ ఆడియో సీడీలను రిలీజ్ చేసి మొదటి కాపీను నాని, వరుణ్ తేజ్ లకు అందించారు. ఈ సందర్భంగా..
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''దిల్ రాజు మా ఫ్యామిలీ ప్రొడ్యూసర్. నేను, ఆయన కలిసి ఇదివరకు తేజుతో ఒక సినిమా చేశాం. అలానే దిల్ రాజు తేజుతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి మంచి టైమింగ్ ఉన్న దర్శకుడు. సాయి కార్తి అందించిన పాటలన్నీ బావున్నాయి. తేజు చాలా కష్టపడి పని చేసే మనిషి. తన కష్టమే ఉన్నత శిఖరాలకు చేరవేస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నాని మాట్లాడుతూ.. ''తేజుని సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో చూస్తే చిరంజీవి గారిలా కనిపించాడు. ఆయనలానే తేజు కూడా అంత ఎత్తుకు ఎదగాలి. అనిల్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఎంటర్టైన్మెంట్, ఫన్ తో పాటు మంచి బ్రిలియన్స్ ఉన్న దర్శకుడు. సాయి కార్తిక్ మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు. దిల్ రాజు గారితో ఎప్పటినుండో సినిమా చేయాలనుకున్నాను. ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. ఆయన ఏ సినిమా చేసిన దాని చుట్టూ ఒక గోల్డెన్ ఎరో కనిపించేది. ఇప్పుడు సుప్రీమ్ సినిమా చుట్టూ కూడా కనిపిస్తోంది'' అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''నేను, తేజ్ చిన్నప్పటి నుండి స్నేహితుల్లా పెరిగాం. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒకరకంగా తేజ్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. తనని చూసే నేను బరువు తగ్గించుకున్నాను. అనిల్ రావిపూడిగారి పటాస్ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. ఈ సినిమా అనిల్ కు, తేజ్ కు, రాజు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలి'' అని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''సుప్రీమ్ అనే టైటిల్ పెట్టుకోవాలంటే అర్హత ఉండాలి. ఈ టైటిల్ వినగానే వెంటనే పెద్దమావయ్యగారిని కలిసి చెప్పాను. 'నువ్వెందుకు భయపడుతున్నావ్ కష్టపడు' అని చెప్పారు. ఈ టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన పేరు నిలబెట్టాలని కష్టపడి పని చేశాను. దిల్ రాజు గారితో ఇది మూడో సినిమా. కథ నచ్చి చెబితే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అనిల్ నాకు మంచి ఎనర్జీ ఇచ్చాడు. ఈ సినిమాతో నాకు మంచి అవకాశం కూడా ఇచ్చాడు. సాయి కార్తిక్ గారితో ఫ్యూచర్ కూడా పని చేస్తాను. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాశి తన కామెడీ టైమింగ్ తో ఇరగదీసింది. ఎప్పటికి అభిమానుల్లో ఒకడిగా ఉండాలనుకుంటున్నాను'' అని చెప్పారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''పటాస్ సినిమా విషయంలో నాకు పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈ సినిమాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ లో కేవలం ఐదు శాతం మాత్రమే సినిమా చూపించాను. ఈ సినిమా వలన ఆర్టిస్ట్ అనే వారు ఎంత కష్టపడతారో తెలుసుకున్నాను. మా సినిమాలో పని చేసిన ఆర్టిస్ట్స్ అందరికి నా కృతజ్ఞతలు. రాజు గారు నాకు డబ్బులు వచ్చే సినిమా చెయ్యు అన్నారు. సినిమా కోసం ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. శిరీష్ నన్ను బాగా నమ్మిన వ్యక్తి. ఈ సినిమా తేజ్ ఎమోషన్స్, కామెడీ చేసేప్పుడు చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. కామెడీ ట్రాక్ లో మేజర్ రోల్ రాశిఖన్నాదే. ఇది టెక్నీషియన్స్ సినిమా. సాయి కార్తిక్ అధ్బుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. రీరికార్డింగ్ కూడా బావుంది. సాయి శ్రీరాం ప్రతి విజువల్ బాగా తీశారు. ఈ సినిమా సమ్మర్ లో ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ అవుతుంది'' అని చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ''మా బ్యానర్ స్థాపించి 13 సంవత్సరాలయ్యింది. ఇప్పటివరకు 16 సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించాం. ఏడుగురు కొత్త దర్శకులను ఇండస్ట్రీకు పరిచయం చేశాం. ఈ సినిమా హిట్ అయితే నాది, తేజు ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది. ఈ సినిమాతో తేజు నెక్స్ట్ లెవెల్ కు ఎదుగుతాడు. చిరు గారితో సినిమా చేయాలనుకున్నాను. అది తేజుతో పూర్తి చేశాను. అలానే పవర్ స్టార్ తో సినిమా చేయాలనుకున్నాను. ఆ కోరికను త్వరలోనే వరుణ్ తో సినిమా చేసి తీర్చుకోబోతున్నాను. పటాస్ సినిమాతో అనిల్ కు బాగా కనెక్ట్ అయ్యాను. ఒక సింపుల్ కథను తీసుకొని రెండున్నర గంటలు చక్కగా ప్రెజంట్ చేశాడు. సాయి కార్తిక్ మంచి బాణీలను అందించాడు. వేసవిలో మా బ్యానర్ లో రాబోతున్న ఓ సక్సెస్ ఫుల్ సినిమా ఇది'' అని చెప్పారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ.. ''2015 లో అనిల్ గారు పటాస్ సినిమా ఇచ్చారు. ఈ సంవత్సరంలో సుప్రీమ్ సినిమా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు చేసిన సినిమాలోని ఒక పాటను రీమిక్స్ చేశామని'' చెప్పారు
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏ .ఎస్ ప్రకాష్, ఎడిటర్: ఎమ్ అర్ వర్మ, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: శిరీష్, సమర్పకులు: దిల్ రాజు, దర్శకత్వం - స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి.