బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ రాజ్ దర్శకుడిగా మురళి బొమ్మకు నిర్మిస్తున్న చిత్రం 'శరణం గచ్ఛామి'. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను బుధవారం హైదరాబాద్ లోని రావినారాయణరెడ్డి స్టేడియంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
డాక్టర్ దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''సినిమా మీద సామాజిక బాధ్యత ఉంది. సమాజాన్ని బాగుచేయకపోయినా పర్వాలేదు కానీ.. తప్పుదోవ పట్టే విధంగా సినిమాలు తీయకూడదు. ప్రస్తుతం ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ రాజ్ ను చూసినప్పుడల్లా తనలో తెలియని ఫైర్ కనిపించేది. చాలా మంది దర్శకులు వ్యాపార ధోరణిలోనే ఆలోచిస్తారు. ప్రేమ్ రాజ్ మాత్రం ప్రత్యేకమైన ధోరణిలో వెళుతున్నాడు. సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆసక్తితో ఒక మంచి కథాంశాన్ని తీసుకొని నిర్మాత మురళి సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
''నిర్మాత మురళి మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రధాన సమస్యను తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒకవైపు మాత్రమే కాకుండా రెండు వైపులా ఈ సమస్యను చర్చిస్తున్నాం. రిజర్వేషన్ కావాలనుకునే వారి వాదనను.. దాన్ని వ్యతిరేకించే వారి వాదనను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అంబేద్కర్ ఎవరికోసం రాజ్యాంగాన్ని రాసారనే విషయాన్ని ఈ సినిమాలో వ్యాపారాత్మక విలువలతో చూపిస్తున్నామని'' దర్శకుడు ప్రేమ్ రాజ్ చెప్పారు.
''ఈ చిత్రాన్ని అన్ని వర్గాల వారు చూసే విధంగా రూపొందిస్తున్నాం. సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇంకా పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని'' నిర్మాత బొమ్మకు మురళి చెప్పారు.