సిద్ధార్ధ్ జాదవ్, జ్యోతీ సుభాష్, శరద్ బుటాడియా శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రధారులుగా రూపొందిన ఓ మరాఠీ చిత్రం 'నైజాం సర్కరోడ' టైటిల్‌తో తెలుగులోకి అనువాదమవుతోంది. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాజ్ దుర్గే దర్శకుడు. రత్నం దవేజి సమర్పణలో మౌళి ఫిల్మ్స్ పతాకంపై రాజమౌళి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. చిత్ర యూనిట్‌ని అభినందించి సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
నిర్మాత రాజమౌళి మాట్లాడుతూ.. ''హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని మహరాష్ట్రలో స్థిరపడ్డ ఒక యోధుడి తనయుడు రాజ్ దుర్గే తెరకెక్కించిన చిత్రమిది. 17 సెప్టెంబర్ 1948 కన్నా ముందు రజాకార్ల రాక్షస రాజ్యంలో జరిగిన అకృత్యాలు, దురాగతాలకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సినిమా. పూట గడవడం కోసం పోరాడే ఓ సామాన్య మనిషి చారిత్రాత్మక విముక్తి పోరాటంలో ఏవిధంగా భాగస్వామి కాగలిగాడనేది ఆసక్తికరం. అప్పటి స్థితిగతులు, సంస్కృతి, భాష, పోరాటాల తీరు దర్శకుడు రాజ్ దుర్గే చక్కగా తెరకెక్కించారు తెలుగు వాళ్లు తీయాల్సిన చిత్రమిది. మరాఠీలో రూపొందిన ఈ చిత్రం అనువాద హక్కులు నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది. తెలుగు వర్షన్‌కి 'నైజాం సర్కరోడ' టైటిల్ కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. చక్కని వినోదం పంచే సినిమా ఇది. ఆర్టిస్ట్ షఫీ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం గొప్ప విషయం. అనువాద కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి తుమ్మల నరసింహరెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు.