'తిక్క' సినిమా డెబ్బై శాతం షూటింగ్ పూర్తయిందని త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్ పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ సినిమా విశేషాలను తెలిపేందుకు చిత్రబృందం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇప్పటికే డెబ్బై శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది. మలేషియాలో కొంత భాగం షూట్ చేయనున్నాం. మూడు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. జూన్ మూడవ వారంలో ఆడియోను రిలీజ్ చేసి జూలైలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలానే మా బ్యానర్ లో నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నామని'' తెలిపారు.
''మే నెలలో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. తొందరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని'' దర్శకుడు సునీల్ రెడ్డి అన్నారు.
''నా స్నేహితుడు నవీన్ తో కలిసి మా చిత్ర నిర్మాతలు మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందని'' సాయి ధరమ్ తేజ్ చెప్పారు.
''దర్శకుడు శశాంక్ చెప్పిన కథ నచ్చడంతో ప్రొడ్యూసర్ గారు మొదటి సినిమా పూర్తవ్వకముందే రెండో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఇది నా మూడవ సినిమా'' అని నవీన్ విజయ కృష్ణ అన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్, మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కథ: షేక్ దావూద్, డైలాగ్స్: లక్ష్మి భూపాల్, ప్రొడ్యూసర్: సి.రోహన్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.