టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 99వ సినిమా డిక్టేటర్ ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకొచ్చిందో అప్పట్నుంచే వందో చిత్రం అంటూ హడావుడి మొదలైంది. మొదట ఆ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరన్న విషయం గురించి పలు ఊహాగానాలు కొనసాగాయి. బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావులు మొదలుకొని కృష్ణవంశీ, రాజమౌళిలాంటి పలువురు స్టార్ దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని రీతిలో క్రిష్‌కి ఆ అవకాశం దక్కింది. ఆయన గౌతమీ పుత్ర శాతకర్ణి కథని తీసుకెళ్లడం, పురాణాలంటే ఇష్టపడే బాలయ్యకి ఆ కథ బాగా నచ్చడంతో వందో సినిమా ఖాయమైంది. క్రిష్ ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు. మరోపక్క నటీనటుల ఎంపికపై కూడా ఆయన దృష్టిపెట్టాడు. తెరపైన కనిపించే నటీనటులంతా కొత్తగా ఉండాలని క్రిష్ భావిస్తున్నాడట. ఆ మేరకు కీలకమైన నటుల్ని బాలీవుడ్ నుంచి తెప్పించాలని ఆయన డిసైడయినట్టు తెలిసింది. సినిమాలో బాలకృష్ణకి తల్లిగా కనిపించే కీలకమైన పాత్ర కోసం హేమమాలిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. అలాగే కథలో వ్యాంప్ తరహా పాత్ర కూడా ఒకటి ఉందట. ఆ పాత్ర విషకన్య తరహాలో ఉంటుందట. అందుకోసం సన్నీలియోన్‌ని సంప్రదిస్తున్నారట. వాళ్లిద్దరూ ఓకే అంటే ఆ పాత్రలు బాగా రక్తికట్టే అవకాశాలున్నాయని చిత్రబృందం భావిస్తోంది. మరి వాళ్లు ఓకే అంటారో లేదో చూడాలి.