70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. రాజమండ్రి, ముంబాయిలలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఏప్రిల్ 15న వైజాగ్‌లో ప్రారంభమవుతుంది.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ''నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాను. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్, 'బెంగాల్ టైగర్' వంటి కమర్షియల్ హిట్, 'ఊపిరి' వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులు నాకు హ్యాట్రిక్‌ని అందించారు. 'ఊపిరి' తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ విజయ్ చెప్పినపుడు చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. మూడు భాషల్లో ఒకేసారి నటించడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఫస్ట్ టైమ్ హార్రర్ కామెడీ మూవీలో నటిస్తున్నాను. నా కెరీర్‌లో 'అభినేత్రి' ఓ సెన్సేషనల్ ఫిలిమ్ అవుతుంది'' అన్నారు.
స్టార్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న తమన్నా, ప్రభుదేవాతోపాటు తెలుగు, హిందీ, తమిళ్‌లో ఆయా భాషల ప్రముఖ నటీనటులు మిగతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమీర్‌ఖాన్ 'గజిని', షారూఖ్‌ఖాన్ 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించిన మనీష్ నందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. అమితాబ్ 'పా' చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్ చేసిన వైష్ణవిరెడ్డి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్నో సార్లు నేషనల్ అవార్డులు అందుకున్న అంటోనీ ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం విశేషం. ఇలా ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మదరాసు పట్టణం, నాన్న, అన్న వంటి డిఫరెంట్ చిత్రాలను రూపొందించిన విజయ్ ఈ చిత్రాన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా రూపొందిస్తున్నారు. అన్‌కాంప్రమైజ్డ్‌గా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. ''బాహుబలి' చిత్రంలో తన అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకున్న తమన్నా ఫస్ట్ టైమ్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. అనుష్కకు 'అరుంధతి', జ్యోతికకు 'చంద్రముఖి'లా తమన్నాకు 'అభినేత్రి' ఓ అద్భుతమైన చిత్రమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ రాజమండ్రి దగ్గరలోని ఓ విలేజ్‌లో జరిగింది. రెండో షెడ్యూల్ ముంబాయిలో చేశాం. మూడో షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి వైజాగ్‌లో జరుగుతుంది. జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: మనీష్ నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: వైష్ణవిరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్.