మహేష్ బాబు ఫోన్ చేసి సుమారుగా అరగంట సేపు మాట్లాడాడు. అలానే శ్రీనువైట్ల, వినాయక్ మా దర్శకులకు ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా చేశారని చెప్పారు. నాగచైతన్య సినిమా చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాడట. ఇలా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారని అక్కినేని నాగార్జున తెలిపారు. నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లోవంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఊపిరి'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''సినిమాలను నిర్మించడంలో పివిపి కొత్త ట్రెండ్ ను సృష్టిస్తోంది. నిర్మాతలను నమ్మకంతో ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. గోపి సుందర్ ప్రతి పాట డైలాగ్ తో కూడిన ఓ సన్నివేశంలా ఉంటాయి. సినిమాలో ప్రతి సీన్ రియలిస్టిక్ గా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ప్రతి సీన్ గురించి మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమా మీతోనే ఉంటుంది సర్ అని చెప్పగానే ఫోన్ పెట్టేసి లోకేషన్స్ వెతుక్కోవాడానికి వెళ్ళారు. సినిమా చూసిన కొందరు కార్తి రోల్ మీకంటే ఎక్కువుందని చెప్పారు. ఎవరి రోల్ ఎక్కువ ఉందని ఆలోచించి సినిమా చేయలేదు. కార్తి నాకు తమ్ముడు లాంటి వాడు. ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన కొన్ని సినిమాలు నాకు చెంప దెబ్బ తగిలేలా చేశాయి. ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన సినిమాలు నాకు మంచి హిట్స్ ను ఇచ్చాయి. ఈ సినిమాలో కూడా ఇమేజ్ ను పక్కన పెట్టి నటించాను'' అని తెలియజేశారు.
''నాగార్జున గారు నిజమైన పాత్ బ్రేకర్. సినిమా షూటింగ్ మొదలయినప్పుడే ఆయన ఇదొక క్లాసిక్ సినిమా అవుతుందని చెప్పారు. కె.బాలచందర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోందని తమిళ వర్గాల నుండి రెస్పాన్స్ వస్తోందని'' వంశీ పైడిపల్లి చెప్పారు.
''ఊపిరి నాకొక లైఫ్ చేంజింగ్ ఫిలిం అయిపోయింది. నాగార్జున గారు సినిమాకు సాలిడ్ పిల్లర్. బాహుబలి తరువాత మరో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం ఊపిరి'' అని కార్తి అన్నారు.
''మా సంస్థకు ల్యాండ్ మార్క్ ఫిలిం అయిందని'' పివిపి చెప్పారు.