నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఊపిరి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
నాగార్జున మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేసినందుకు చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇది ఫ్రెంచ్ సినిమా రీమేక్. ఇద్దరి మనుషుల మధ్య జరిగిన నిజమైన కథ ఈ సినిమా. ఇప్పటికి వారిద్దరు బ్రతికే ఉన్నారు. కొన్ని కథలకు సోల్ ఉంటుంది. అటువంటి సినిమానే మా 'ఊపిరి'. ఈ సినిమాతో మంచి అనుభవం కలిగింది. వంశీ తనను తాను రీఇన్వెంట్ చేసుకొని.. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాను కోరుకుంటారో.. అలాంటి సినిమాను చేశాడు. కార్తి కథల పట్ల చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. తను ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్ళలో పది సినిమాలను మాత్రమే చేశాడు. తెలుగులో ఈ సినిమాతో తన స్ట్రెయిట్ సినిమా చేయడం కరెక్ట్ అని భావించాడు. సెట్స్ లో కొన్ని సీన్స్ లో తను నటిస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోయేవాడ్ని. జయసుధ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. నాకు కార్తిను చూసి సిగ్గేసేది. తెలుగు రాకపోయినా.. నేర్చుకొని చక్కగా డైలాగ్స్ చెప్తున్నాడు.. నేను తమిళంలో ఎందుకు సరిగ్గా చెప్పలేకపోతున్నానని అనుకునేవాడ్ని. అలానే తమన్నా కథలో ఇన్వాల్వ్ అయ్యి నటించింది. నా కెరీర్ లో ఇదొక లైఫ్ చేంజింగ్ ఫిలిం అవుతుంది. నేను నటించిన శివ, గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా వస్తుంది. నిన్ననే సినిమా చూశాను. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి జీవితానికి తోడు ఉంటే హ్యాపీగా ఉండొచ్చని చెప్పే కథే ఈ సినిమా'' అని చెప్పారు.
కార్తి మాట్లాడుతూ.. ''మొదటిసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా ఒక డ్రీమ్ లా జరిగింది. నటుడు అనేవాడికి తృప్తినిచ్చే సినిమా ఇది. సినిమాలతో డబ్బు వస్తుంది, బిజినెస్ అవుతుంది అంటుంటారు. కాని ఈ సినిమాతో గౌరవం వస్తుంది. ట్రెండ్ సెట్ చేసే సినిమా అనొచ్చు. నాగార్జున గారు మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో నటించారు. ఆయనతో మంచి రిలేషన్ ఏర్పడింది. ఫ్రెష్ ఫిలిం. వంశీ గారు ప్రతి క్యారెక్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు'' అని చెప్పారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''ఈ సినిమా చూసిన వెంటనే నాగార్జున గారు, పివిపి గారు వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఊపిరి ఈ సినిమా. పివిపి గారు సినిమా కోసం ఎంత మనసు పెట్టారో నాకే తెలుసు. గోపిసుందర్ తన మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాడు. నాగార్జున గారు లేకపోతే నేను అసలు ఈ సినిమా చేసేవాడ్ని కాదు. మార్చి 25న సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
పివిపి మాట్లాడుతూ.. ''రెండు సంవత్సరాలుగా అందరం కలిసి కష్టపడి చేసిన సినిమా. మాకు నచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తున్నాం. ఒక్క అమెరికాలోనే 90 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోంది. తమన్నా ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. అలానే నాగార్జున గారు తమిళంలో ఈ చిత్రానికి మొదటిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు'' అని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ.. ''నాగార్జున గారు, కార్తి లేకుండా ఊపిరి సినిమాను ఊహించుకోలేం. వారిద్దరు తమ పాత్రల్లో జీవించారు. సినిమాలో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సినిమాలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా గర్వపడతారు'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, ఫైట్స్: కలోయిన్ ఒదెనిచరోవ్, కె.రవివర్మ, సిల్వ, డాన్స్: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్: వంశీ పైడిపల్లి, సాల్మన్, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, సమర్పణ: పెరల్ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.