స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ చిత్రంప్లాటినం డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సుద్దాల అశోక్ తేజ ప్లాటినం డిస్క్ లను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా..
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ''నారాయణ మూర్తి కాలం వంటివాడు. ఎవరికీ లొంగకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ సినిమాలో సమాజంలో ఉన్న సమస్యలతో పాటు తల్లి, బిడ్డల మధ్య బంధాన్ని కూడా వివరించాడు'' అని చెప్పారు.
గద్దర్ మాట్లాడుతూ.. ''సామాజిక ప్రయోజనం కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు నారాయణమూర్తి చేసిన అన్ని సినిమాలకంటే ఇదొక రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఆయన ఇలానే సినిమాలు చేసుకుంటూ.. ముందుకు సాగాలి'' అని చెప్పారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతుంది. పర్యావరణమంతా.. సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదీవాసీయుల హక్కులను ఉల్లంగించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇటీవలే సినిమా ఆడియో విడుదలయింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాహిత్యాన్ని అందించి పాటలు పాడిన ప్రజాకవులకు, గద్దర్ గారికి, వందేమాతం శ్రీనివాస్ కు నా కృతజ్ఞతలు. భారతదేశంలో లో సుమారుగా 12 రాష్ట్రాల్లో ఉన్న అడవులు నాశనమైపోతున్నాయి. ఉద్యమకారులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. దండకారణ్యంలో ఎలాంటి మారణహోమం జరగకుండా హోమాలు జరిపించాలి. దండకారణ్యం గురించి కూడా పార్లమెంట్‌లో చర్చలు జరగాలి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న,యశ్ పాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.