వినీత్, మోనికా సింగ్ జంటగా వి2 ఫిల్మ్స్ ప్రై||లి|| పతాకంపై అశోక్ గోటి నిర్మిస్తున్న చిత్రం 'పిడుగు'. ఈ చిత్రంతో రామమోహన్.సి.హెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో వినీత్ విలేకర్లతో ముచ్చటించారు. ''చిన్నప్పటినుండి నాకు సినిమాలంటే ఆసక్తి. కాని చదువు పూర్తయిన తరువాతే సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఎం.బి.ఏ పూర్తి చేశాను. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించమని ఆఫర్స్ వచ్చాయి. 'పిడుగు' సినిమాను మా సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం. సినిమాలో మొత్తం ఐదు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. నా పాత్ర పేరు జై శ్రీ వాత్సవ్. నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. సంపన్న కుటుంబానికి చెందిన శ్రీ వాత్సవ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన తరువాత తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేదే సినిమా కథ. సినిమా మొదలయినప్పటి నుండి చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. యాక్షన్, రొమాన్స్, లవ్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. నాకు జంటగా మోనికా సింగ్ నటించింది. పెద్ద బడ్జెట్ లో తీసాం. ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో చేయాల్సిన కథ కాని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాతో చేసారు. నటునిగా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనుంది. కాని యాక్షన్ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. నా తదుపరి చిత్రం మంచి ఫేం ఉన్న డైరెక్టర్ తో కమర్షియల్ సినిమా చేయబోతున్నాను'' అని తెలియజేశారు.