రామచంద్ర, ఆశాలత జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'అమ్మాయి ఆరుగురు'. జి.మురళీప్రసాద్ దర్శకుడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. అక్షయ్ ప్రత్యూష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామచంద్ర దోసపాటి నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీలను విడుదలచేసి, తొలి సీడీని మరో అతిథిగా పాల్గొన్న బసిరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ''రెండు సినిమాలు చేశాను. మూడో సినిమా ఇది. చక్కటి హారర్ కథ కుదిరింది. బసిరెడ్డిగారు డిజిటల్ మీడియాపరంగా పూర్తి సహకారాన్ని అందించారు. వందేమాతరం శ్రీనివాస్ మంచి సంగీతాన్ని అందించారు. ఆరుగురు డబ్బున్న అబ్బాయిలు ఓ జంటను హత్యచేస్తారు. ఆ జంటలోని అమ్మాయి దెయ్యంగా మారి ఆరుగురు యువకులపై ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే కథ. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులందరూ చిత్రం బాగా రావడానికి తమవంతుగా చక్కటి సహకారాన్ని అందించారు'' అని అన్నారు.
బెక్కం వేణుగోపాల్, బసిరెడ్డి మాట్లాడుతూ.. ''దర్శకుడు మురళి స్క్రిప్ట్ వర్క్ చాలాబాగా చేస్తారు. ఇలాంటివారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని పేర్కొనగా, త్వరలో మురళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని సాయివెంకట్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి, నిర్మాత రామచంద్ర దోసపాటి, సినిమాటోగ్రాఫ్ సుధీర్, కథానాయిక ఆశాలత తదితరులు పాల్గొన్నారు.