ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శ్రుతి మోల్, మనాలి ప్రథాన పాత్రల్లో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. చిత్రదర్శకుడు అశోక్ రెడ్డి విలేకర్లతో ముచ్చటించాడు.
''మాది గుంటూరు జిల్లాలోని అంబాపురం గ్రామం. ఎం.బి.ఏ పూర్తి చేసి బెంగుళూరులో రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం చేశాను. జాబ్ చేసే సమయంలోనే రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చిన్నప్పటినుండి నాకు సినిమాల పిచ్చి ఉండేది. ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో చదువుపూర్తి చేసిన తరువాత సినిమాలు మొదలుపెడదాం అనుకున్నాను. నేను చేసిన రెండు షార్ట్ ఫిల్మ్స్ కు మంచి పేరొచ్చింది. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర పని చేయలేదు. ట్రెండ్ మారింది కదా అంతా ఆన్లైన్ లోనే నేర్చుకున్నాను. ప్రాక్టికల్ గా అనుభవం తెచ్చుకోవడానికి లఘు చిత్రాలను రూపొందించాను. నిజానికి 'ఓ స్త్రీ రేపు రా' సినిమాను కూడా నలభై నిమిషాల సినిమాగా చిత్రీకరించాను. చాలా మందికి చూపించాను. సినిమాగా చేస్తే బావుంటుందనడంతో స్క్రిప్ట్ మీద వర్క్ చేసి సినిమా చేశాను. కథ కోసం చాలా రిసెర్చ్ చేశాను. ఓ స్త్రీ రేపు రా అనే దాని గురించి ఎవరిని అడిగినా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పేవారు. కాని ఎక్కువమంది ఒక సమాధానం చెప్పారు. ఈ సినిమా 1980 వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ జెనరేషన్ వాళ్లకి తెలియబరచాలనే ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో దయ్యమే కథ చెబుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చే హారర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమా నిలుస్తుంది. గ్రాఫిక్స్ లేకుండా సౌండ్ తో సినిమా నడిపించాం. కామెడీ సెపరేట్ గా ఉండదు. కథలో భాగంగా ఉంటుంది. మొత్తం 70కి పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నా తదుపరి సినిమా కొత్త బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది'' అని తెలియజేశారు.