మెగా కాంపౌండ్ నుంచి తొలి హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఒక మనసు షూటింగ్ పూర్తయింది. నాగశౌర్య, నిహారిక జంటగా మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న క్యూట్ లవ్‌స్టోరీ ఇది. ఇప్పటికే టి.వి. ప్రోగ్రామ్స్ ద్వారా, యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ ద్వారా పాపులర్ అయిపోయిన నిహారిక తెరంగేట్రం చాలా గ్రాండ్‌గా జరగబోతోందట. నిహారిక నటించిన ముద్దపప్పు ఆవకాయ షార్ట్ ఫిలిమ్స్ సిరీస్‌కి ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ రావడం రికార్డుగా చెప్పుకుంటున్నారు.
నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో దామోదరప్రసాద్ నిర్మించిన కళ్యాణ వైభోగమే ఈ శుక్రవారం రిలీజ్‌కి సిద్ధమవుతోంది. వరస ఫ్లాపుల్లో వున్న నాగశౌర్య ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే కళ్యాణ వైభోగమే కంటే ఒక మనసు నాగశౌర్యకి మంచి పేరు తెస్తుందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మెగా హీరోయిన్ నిహారిక ఎలాగూ వుంది కాబట్టి ఆ సినిమా పబ్లిసిటీకి ఎలాంటి ఢోకా వుండదు. ఆ విధంగా నాగ శౌర్యకి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది. మరి మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.