శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన చిత్రం 'టెర్రర్'. ఇటీవల విడుదలయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
నిర్మాత మాట్లాడుతూ.. ''నా తొలి సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్రారంభమైన తొలి రోజు నుంచి విడుదలయ్యే వరకు హీరో శ్రీకాంత్ గారు అన్ని విధాల సహకరించబట్టి ఈ సినిమా ఈ రోజు ఇంత మంచి పేరు తెచ్చుకుంది. మా దర్శకుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే లక్ష్పీ భూపాల్ గారి సంభాషణలు, సాయికార్తీక్ గారి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు'' అని అన్నారు.
దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ.. ''సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కావడంతో నేను చెప్పిన కథకు కనెక్టయ్యారు మా నిర్మాత కరీమ్ గారు. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాని అనుకున్న విధంగా చేయడానికి ఫ్రీడం ఇచ్చారు. అందుకే సినిమాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇక శ్రీకాంత్ గారు ఎంత మంచి యాక్టరో అంతకు మించి మంచి వ్యక్తిత్వమున్న వారు. 'టెర్రర్' చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు'' అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''సరిగ్గా 25 యేళ్ల క్రితం 'ఎన్ కౌంటర్' సినిమా విడుదలైంది. అందులో నక్సలైట్ లీడర్ గా నటించాను. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు కావొస్తున్న తరుణంలో టెర్రర్ విడుదల కావడం, సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా చేస్తే హిట్ చేస్తారని ప్రేక్షకులు నిరూపించారు. చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశానన్న తృప్తి కలిగింది. సినిమాకు థియేటర్స్ కూడా పెరిగాయి. ఇక మీదట మంచి సినిమాలు మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాను'' అని చెప్పారు.