కృష్ణ అజయ్ రావు, శ్రావ్య జంటగా సహన హెచ్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పంతులుగారి అమ్మాయి'. కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చంద్రకళ సమర్పణలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వరప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. సాగర్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను టి.ప్రసన్నకుమార్ కు అందించారు.
సాగర్ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే తెలుగు నెటివిటీ కనపడుతుంది. కన్నడలో సక్సెస్ అయిన విధంగానే తెలుగులో కూడా పెద్ద విజయం సాధించాలి'' అని అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారు మినీ థియేటర్స్ కట్టించడానికి పూనుకున్నారు. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఈ చిత్ర నిర్మాతలు తెలుగులో నేరుగా సినిమా చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు
నిర్మాత వరప్రసాద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కన్నడంలో పెద్ద సక్సెస్ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నాం. మా బ్యానర్ లో ఇది వరకు వచ్చిన రెండు చిత్రాలను ఆదరించిన విధంగానీ ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమాలో సాయి కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చాయాలని భావించాం కాని ఇప్పుడు మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు: శ్రీసాయి, శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి, సహ నిర్మాతలు: శ్రీమతి అందాల రాజేశ్వరి, ముద్దం రామచంద్రుడు, నిర్మాత: వరప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సహన హెచ్.ఎస్.