నాగార్జున ద్విపాత్రాభినయంలో కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. సంక్రాంతికి విడుదలయిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమా విడుదలయ్యి 35 రోజులు దాటినా సక్సెస్ ఫుల్ గా అన్ని థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా..
నాగార్జున మాట్లాడుతూ.. ''నేను నటించిన 'మనం' లాంటి క్లాసికల్ సినిమాను, 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి కుటుంబ కథా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. కొత్త పాత్రల్లో నటించొచ్చని, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయోచ్చనే.. నమ్మకం కుదిరింది. సుమారుగా 400 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశాం. అది కూడా నేను ముందుగానే థియేటర్లు బుక్ చేసుకోవడం వలన జరిగింది. లేదంటే పండగ సమయంలో నాకు థియేటర్లు దొరికేవి కావు. మూడవ వారానికి సినిమా లేకుండా పోతున్న ఈరోజుల్లో.. మా సినిమా మంచి షేర్స్ ను సాధించింది. 35 వ రోజు కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. నేను ఎప్పుడు సినిమా ఎంత కలెక్ట్ చేసిందని నెంబర్స్ చూడను. నెంబర్స్ అనేవి తాత్కాలికమే.. ఈరోజు డెబ్బై, రేపు ఎనబై, మరోరోజు తొంబై ఇలా నెంబర్స్ అనేవి వస్తూ.. ఉంటాయి.. పోతూ ఉంటాయి. అలా చూసుకుంటే 'మాయాబజార్','అడవిరాముడు','ప్రేమాభిషేకం' లాంటి సినిమాల నెంబర్స్ ఇప్పుడు ఎంత ఉండేవో మనం చెప్పలేము. ఈ సినిమా సక్సెస్ తో మాకు మోరల్ సపోర్ట్ లభించింది. కళ్యాన్ ఎంత కష్టపడ్డాడో.. నాకు బాగా తెలుసు. ప్రతి డైలాగ్ జాగ్రత్తగా రాసుకున్నాడు. బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. ఈ క్రెడిట్ అంతా కళ్యాన్ కే చెందుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం తనే చేశాడు. మరెవరు ఇన్వాల్వ్ కాలేదు. సినిమాకు ఎంత అవసరమో అంటే చేశాం. అందరూ ప్రేమించి చేసిన సినిమా. 'సోగ్గాడే చిన్ని నాయన' రిలీజ్ కు ముందే సీక్వెల్ చేయాలనుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తరువాత మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యాం. బంగార్రాజు అనే టైటిల్ రిజిస్టర్ చేశాం. మొదట నేను 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనుకున్నాను కాని బంగార్రాజు క్యారెక్టర్ బాగా హిట్ అయింది. అదే పేరు టైటిల్ గా చేస్తే బావుంటుందని చేశాం. ఆ సినిమా కూడా ఏదొక పడగకు తీసుకొస్తాం. ఈరోజే 'ఊపిరి' సినిమా చూశాను. చాలా తృప్తిగా అనిపించింది. తమిల్ డబ్బింగ్ కూడా నేనే చెబుతున్నాను. ఇక నా తదుపరి చిత్రం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి చరిత్రకు చెందిన హతిరాం బాబా పాత్రలో నటిస్తున్నాను. 18వ శతాబ్దానికి చెందిన కథ. ఏప్రిల్, మే నెలలో సినిమాను ప్రారంభించాలనుకుంటున్నాం. దిల్ రాజు గారు కథ వినమని అడిగారు. వీలు చూసుకొని వెళ్లి వింటాను. నచ్చితే చేస్తాను. అలానే కళ్యాన్ కృష్ణ అన్నపూర్ణ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. నాగచైతన్య కోసం ఒక కథ చెప్పాడు. 'ప్రేమమ్' సినిమా పూర్తయిన వెంటనే కళ్యాన్ కృష్ణ సినిమా ప్రారంభమవుతుంది. నేను ఇండస్ట్రీకు వచ్చి 32 సంవత్సరాలవుతున్న ఈ సమయంలో కూడా సోగ్గాడే సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. దానికి నేను ఎప్పడు విలువ కట్టలేను'' అని చెప్పారు.
కళ్యాన్ కృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాసం ఇచ్చిన నాగార్జున గారికి థాంక్స్. నా నెక్స్ట్ సినిమా ఇంకా జాగ్రత్తగా చేస్తాను'' అని చెప్పారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా రీరికార్డింగ్ చేసే సమయంలో మా అమ్మ చనిపోయారు. ఆ టైం లో నాగార్జున గారు నాకు సహాయంగా నిలిచారు. కళ్యాన్ సాంగ్స్ చేయడానికి మంచి సిట్యుయేషన్స్ ఇచ్చాడు'' అని చెప్పారు.