Advertisement

నాన్నకు నేనే పెద్ద అభిమానిని:మహేష్

Fri 19th Feb 2016 02:49 PM
sree sree music launch,krishna,vijayanirmala,muppalaneni siva  నాన్నకు నేనే పెద్ద అభిమానిని:మహేష్
నాన్నకు నేనే పెద్ద అభిమానిని:మహేష్
Advertisement

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీ శ్రీ'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. మహేష్ బాబు బిగ్ సీడీను, ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

మహేష్ బాబు మాట్లాడుతూ.. ''నాలుగైదు నెలల క్రితం ఈ సినిమాలో నాన్నగారి గెటప్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఒక్కసారిగా నా చిన్నతనం గుర్తొచ్చింది. నాన్నగారికి పెద్ద అభిమాని ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఆయన ఎప్పుడు నా ఫంక్షన్స్ కి వస్తుంటారు.. కాని ఈరోజు నేను నాన్న ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ముప్పలనేని శివగారికి, నిర్మాతలకు నా అభినందనలు. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులకు నేను థాంక్స్ చెప్పుకోవాలి.. ఒకరు 'తేనెమనసులు' నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, మరొకరు గూడాచారి 117 సినిమా చేసిన దర్శకుడు. ఈ రెండు సినిమాలను ఎప్పటికి మర్చిపోలేను. నేను మంచి పాత్రలో నటించి 6 నుండి 7 సంవత్సరాలయ్యింది. శివ మరాఠికు చెందిన ఈ సినిమా కథ వినిపించాడు. వెంటనే చేస్తానని చెప్పేసాను. నాకు చెప్పిన దానికంటే 100 శాతం ఇంకా బాగా తీశాడు. నా కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది'' అని చెప్పారు. 

కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''అల్లూరి సీతారామరాజు సినిమాతో తెలుగు సినిమా కెపాసిటీ ఏంటో నిరూపించాడు. మోసగాళ్ళకు మోసగాడు, కౌబాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. కృష్ణకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గొప్పది. ఎంతంటే.. తన ఆఖరి కూతురిని దత్తత తీసుకుంటానని అడిగిన వెంటనే ఇస్తా అన్నాడు. మహేష్ బాబును హీరోగా 'బాబీ' సినిమాతో పరిచయం చేస్తానని చెప్పాను. మాలో మాకు ఎలాంటి తేడా ఉండదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఆడది ఉంటుందంటారు. కృష్ణ వెనుక విజయనిర్మల ఉంది. ఎప్పటికి కృష్ణను అలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కృష్ణ అలసిపోకుండా సినిమాలు చేస్తూనే ఉండాలి. ఈ సినిమాతో శివ అభివృద్ధిలోకి రావాలి'' అని చెప్పారు.

విజయనిర్మల మాట్లాడుతూ.. ''కృష్ణగారు నేను కలిసి చేస్తోన్న 48వ చిత్రమిది. మరాఠీ సినిమా కంటే ముప్పలనేని శివ గారి ఇంకా గొప్పగా తీశారు'' అని చెప్పారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''సామాన్యుడికి ఎదురుగా అన్యాయం జరిగితే అది చూసి గుండె రగిలిపోయే ప్రతి ఒక్కరు శ్రీశ్రీ నే. ఈ కాన్సెప్ట్ మీదే సినిమా చేశాం. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఇది మా మొదటి ప్రొడక్షన్. కృష్ణ లాంటి లెజండరీ యాక్టర్ తో పని చేయడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం'' అని చెప్పారు 

మ్యూజిక్ డైరెక్టర్ ఇ.ఎస్.మూర్తి మాట్లాడుతూ.. ''కృష్ణగారికి, విజయనిర్మల గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా హిట్ కావాలి'' అని చెప్పారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''కృష్ణగారు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజీ మీద ఉండేవాడిని కాదు. బయట ఎంత సంపాదిస్తూ.. ఉండేవాడినో తెలియదు కాని.. ఇంతమంది అభిమానులను మాత్రం సంపాదించుకోలేను. ఈ సినిమాలో నేనొక చిన్న పాత్రలో నటించాను. 'భలే మంచి రోజు' లాంటి పెద్ద హిట్ వచ్చినా... ఫ్యూచర్ లో 'శ్రీమంతుడు' లాంటి సినిమాలో నటించే ఆఫర్ వచ్చినా.. ఈ సినిమాలో నటించే తృప్తి మాత్రం ఏ సినిమాలో నటించినా లభించదు. 10 సంవత్సరాలు కృష్ణగారు ఎదురు చూసినందుకు మంచి సినిమా దొరికింది. చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో కోదండ రామిరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, నరేష్, ఆది శేషగిరిరావు, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ: రమేష్ డిఓ ప్రొడక్షన్స్, డైలాగ్స్: రామ్ కంకిపాటి, మ్యూజిక్: ఇ.ఎస్.మూర్తి, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటర్: రమేష్, కాన్సెప్ట్ రైటర్: కళ్యాన్ జీ, కో డైరెక్టర్: రమేష్ రాజా.ఎం, ఫైట్స్: నందు, అసోసియేట్ డైరెక్టర్: విజయ భాస్కర్ కైలాసపు, నిమ్మకాయల కోటి, అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీ రామ్, కాస్ట్యూమ్స్: రమేష్, సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: తాండవ కృష్ణ, నారాయణ, ప్రొడక్షన్ మేనేజర్: కె.మల్లిక్, నిర్మాతలు: శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్, దర్శకత్వం: ముప్పలనేని శివ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement