ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని జంటగా ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం 'మలుపు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో
రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ.. ''నా పెద్ద కొడుకు సత్య టాలెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను నేనే స్వయంగా ప్రొడ్యూస్ చేశాను. అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు చేసి కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ కి జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించాడు. ఆది అయితే ఈ కథకు న్యాయం చేయగలడనే నమ్మకంతో హీరోగా తననే సెలెక్ట్ చేసుకున్నాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. మంచి సినిమా చుసామనే తృప్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని సత్య నిలబెట్టుకున్నాడు. ఆది దర్శకుల హీరో. వారిద్దరికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.
సత్య ప్రభాస్ మాట్లాడుతూ.. ''మా నాన్న లేకపోతే ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. ఆది బడ్జెట్ కు మించి ఈ సినిమాకు ఖర్చుపెట్టాల్సి ఉంది. స్క్రిప్ట్ నచ్చి మా నాన్నే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఆదికి ఎన్ని ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చినా.. ఈ సినిమా కంప్లీట్ చేసిన తరువాతే చేస్తానని వచ్చిన ఆఫర్స్ అన్నీ వొదిలేసుకున్నాడు. కంటెంట్ బావుంటే ఆడియన్స్ చూస్తారనే నమ్మకంతో సినిమా చేశాను. నాకు సహకరించిన టీం అందరికి థాంక్స్'' అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ.. ''అందమైన మలుపుల తరువాత ఫిబ్రవరి 19న సినిమా రిలీజ్ అవుతోంది. అందరం ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. రెగ్యులర్ సినిమాల్లో ఉండే కమర్షియల్ ఫార్ముల ఈ సినిమాలో ఉండదు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మిస్ అవ్వదు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిక్కి, ప్రగతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.