బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ 'సుందరపాండ్యన్'కు రీమేక్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'స్పీడున్నోడు'. భీమనేని సునీత నిర్మాత. ఈ చిత్రం టీజర్ ను హీరో సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. నాలుగు రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఆడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటివారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం. 'సుందరపాండ్యన్' సినిమా తమిళంలో, కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు. అందుకే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. నేను డైరెక్ట్ చేసిన 'సుస్వాగతం' , 'సూర్యవంశం' , 'శుభాకాంక్షలు' తరువాత అంత మనసుపెట్టి చేసిన సినిమా ఇది. 'సుడిగాడు' తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం పని చేశాను. ప్యాషనేట్ గా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాం. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమాలో ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అరగంట పాటు హీరో మీదే సినిమా ఆధారపడి ఉంటుంది. ఆ పాత్రకు శ్రీనివాస్ న్యాయం చేశాడు. తన కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచే సినిమా అవుతుంది. ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్ తో పాటు పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టాడు. సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా రెండు గంటల పాటు ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది'' అని చెప్పారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''అల్లుడు శీను తరువాత ఎలాంటి సినిమాలో నటించాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా కథ విన్నాను. తెలుగు ఆడియన్స్ కు నచ్చే కథ అవుతుందనే నమ్మకంతో సినిమా చేశాను. భీమనేని శ్రీనివాస్ లాంటి సీనియర్ డైరెక్టర్ తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. టీం అందరూ కష్టపడి చేసిన సినిమా. వసంత్ గారి మ్యూజిక్ రాకింగ్ గా ఉంటుంది. విజయ్ గారు స్క్రీన్ పై నన్ను చాలా అందంగా చూపించారు. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
వివేక్ మాట్లాడుతూ.. ''సినిమా బిజినెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయ్యర్స్ అందరూ ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొన్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గౌతంరాజు, మధునందన్, చైతన్య కృష్ణ, కిరణ్ కుమార్, వసంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: డి.జె.వసంత్, ఎడిటర్: గౌతంరాజు, కెమెరామెన్: విజయ్ ఉలాగనథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, మాటలు: భీమనేని శ్రీనివాసరావు, ప్రవీణ్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే, నిర్మాత: భీమనేని సునీత, స్టొరీ డెవలప్మెంట్-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: భీమనేని శ్రీనివాసరావు.