సూరి, రూపా రెడ్డి ప్రధాన పాత్రల్లో నిషాంత్ దర్శకత్వంలో పుధారి అరుణ నిర్మిస్తోన్న చిత్రం 'బొమ్మల రామారం'. ఈ చిత్రం టీజర్, పోస్టర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ టీజర్ ను విడుదల చేయగా.. రాజ్ కందుకూరి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరం నుండి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలకు, ఆడియో ఫంక్షన్స్ కు దూరంగా ఉండాలనుకున్నాను. అయితే ఈ సినిమా టీజర్ చూసి నేనే ఫంక్షన్ కు వచ్చాను. టీజర్ చాలా బావుంది. దర్శకుల ఆలోచనా ధోరణి మారుతోంది. కమర్షియల్ చిత్రాల టైపులోనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం నుండి మరింత బాగుండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''ఈ సినిమా డైరెక్టర్ నిషాంత్, హీరో సూరిలతో నాకు మంచి పరిచయం ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తున్నంతసేపు శ్యాం బెనిగల్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది. సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు నిషాంత్ మాట్లాడుతూ.. ''సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీం ఎఫర్ట్ తో చేసిన సినిమా. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత అరుణ మాట్లాడుతూ.. ''ఓ కుటుంబంలాగా అందరం కష్టపడి పని చేశాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: బి.వి.అమర్ నాథ్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్స్: కార్తిక్ కొడకండ్ల, శ్రవణ్ మైకేల్, ఎడిటర్: శివ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, నిర్మాత: పుధారి అరుణ, రచన-దర్శకత్వం: నిషాంత్ పుధారి.